Bakkani Narasimhulu Appointed As TTDP President :
తెలంగాణ టీడీపీకి కొత్త బాస్ ఖాయమయ్యారు. అందరూ ఊహించినట్టుగా బక్కని నర్సింహులుకే టీడీపీ అధిష్టానం మొగ్గుచూపింది. మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కావడం.. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. ఈ మేరకు సోమవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును(Bakkani Narasimhulu) నియమించారు. ఎల్.రమణ స్థానంలో బక్కని బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా బక్కని నర్సింహులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటం చేయాలని లోకేశ్ సూచించారు.
ఎమ్మెల్యేగా అనుభవం
మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు టీడీపీ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. అయితే పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్‌గౌడ్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వ్యక్తిగత కారణాల వల్ల రావుల ఇష్టత చూపకపోవడంతో బక్కని నర్సింహులు వైపు టీడీపీ మొగ్గు చూపింది.
ముందున్న సవాళ్లు
టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న బక్కని నర్సింహులు ముందు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. తెలుగు రాష్ర్టం ముక్కలు కాకముందు తెలంగాణలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. నిబద్ధత గల నాయకులు, కార్యకర్తలను తీర్చిదిద్దింది. ఎంతోమందికి రాజకీయ జీవితం అందించింది. చంద్రబాబు హాయంలో తెలంగాణ నుంచి ఎంతోమంది లీడర్లుగా ఎదిగినవాళ్లు ఉన్నారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చెలామణి అయ్యారు. తలసాని శ్రీనివాస్, ఎర్రబల్లి, కడియం శ్రీహరి, మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి ఇలా ఎంతోమంది టీడీపీ నుంచి వచ్చినవాళ్లే. ప్రత్యేక తెలంగాణంగా అవతరించిన కూడా టీడీపీ సత్తా చాటింది. అయితే బలమైన అధ్యక్షుడు లేక టీడీపీ నేతలంతా ఇతర పార్టీలకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో బక్కని ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని చెప్పక తప్పదు. తెలంగాణవ్యాప్తంగా తమ్ముళ్లను తట్టిలేపితే.. టీడీపీ బలమైన పార్టీగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు.
Must Read ;- టీడీపీ రెడీ.. వైసీపీ నాట్ రెడీ