బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకు కారణంగా వాళ్ల కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘సింహా’ .. ‘లెజెండ్’ వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేయడమే. అంతేకాదు .. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడిన బాలయ్య సినిమాల జాబితాలో చేరిపోయాయి. దాంతో సహజంగానే ఈ ఇద్దరి కాంబినేషన్లోని మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది.
బోయపాటి తన సినిమాల టైటిల్స్ విషయంలో చాలా శ్రద్ధ పెడతాడు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకి టైటిల్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండేలా చూసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు షికారు చేశాయి. ఆ తరువాత వేరే టైటిల్స్ ఒకటి రెండు తెరపైకి వచ్చాయి. కానీ ‘మోనార్క్’ టైటిల్ నే ఫైనల్ చేశారనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.
మొదట్లో ఈ టైటిల్ గురించిన వార్త బయటికి వచ్చినప్పుడే, ఇది తమ బాలయ్య క్రేజ్ కి తగిన టైటిల్ అనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు అదే టైటిల్ ఖరారైందని తెలిస్తే వాళ్లు మరింత ఖుషీ అవుతారు. గతంలో బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేసినా ఆయనను ‘సింహా’ .. ‘లెజెండ్’ సినిమాల్లో మరింత కొత్తగా చూపించి బోయపాటి మంచి మార్కులు కొట్టేశాడు. తాజా సినిమాలోను బాలయ్య లుక్ ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. పవర్ఫుల్ డైలాగ్స్ .. పసందైన సాంగ్స్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే.











