బాలయ్య ‘అఖండ’ గర్జన ప్రారంభమైనట్టే. ఈ సినిమా విడుదల మీద చాలా మందికి సందేహాలు ఉన్నాయి. డెసెంబరు నెలాఖరు, ఫిబ్రవరి.. ఇలా రకరకాల డేట్లు వినిపించాయి. ఇప్పటిదాకా విడుదల తేదీ రాకపోయినా సర్ ప్రైజ్ న్యూస్ అతిత్వరలో రాబోతోంది. డిసెంబరు 2న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభమైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 13న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందే సినిమా ప్రారంభోత్సవం జరుగనుంది.
అఖండ డిసెంబరు 2న విడుదలయ్యే పక్షంలో టీజర్, ట్రైలర్ విడుదల వరుసగా జరుగుతుంది. మొన్న టైటిల్ సాంగ్ విడుదలతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పౌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించే ఈ చిత్రానికి బోయపాటి శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికాలో డిసెంబరు 1వ తేదీనే ప్రీమియర్ షోలు పడనున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడమే. ఈ సినిమా విడుదల తేదీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటించారు. డిసెంబరు, జనవరి నెలల్లో వరుసగా ఇలాంటి భారీ చిత్రాలన్నీ విడుదలకు క్యూకడుతున్నాయి.











