తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంగా స్వర్గీయ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఓ ప్రభంజనంలా మారింది. అదే తెలుగు దేశం పార్టీగా పురుడు పోసుకుంది. 1982 మార్చి 29న ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా..! అంటూ పిలుపు ఇచ్చిన రోజును ఎవరూ మరచిపోలేరు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఒడుదొడుకులు.. మరెన్నో విజయాలు.. ఇప్పుడు 41వ ఆవిర్భావదినోత్సవాన్ని ఆ పార్టీ జరుపుకుంటోంది. ఈ వేడుకలో ఎన్టీఆర్ వారసులు, ఇతర నేతలు, కార్యకర్తలు పాలు పంచుకుంటున్నారు. పార్టీ పెట్టిన9 నెలలకే 1983లో అధికారాన్ని చేజిక్కించుకుంది.
1985, 1989, 1994లలో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. పార్టీలో అంతర్గత పరిణామాలతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన విషయాన్నీ మనం గుర్తు చేసుకోవలసిందే. పార్టీ అధ్యక్షుడిగా ఆయన పట్టు సాధించడమే కాదు ఈరోజుకీ ఆ పార్టీ బలమైన శక్తిగా జనంలో ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న ఆ పార్టీ ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లోు సత్తా చాటి అధికార పక్షం వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
త్వరలో జరిగే శాసన సభ ఎన్నికల్లో విజయడంకా మోగించేందుకు సంసిద్ధమవుతోంది. 41 వసంతాల తెలుగుదేశం ఆవిర్భావ వేడుకలు ఓ పక్క, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఇంకో పక్క కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అందరికీ శుభాభినందనలు తెలిపారు. ఆయన నట వారసుడు నందమూరి బాలకృష్ణ కూడా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ మరో కుమారుడు నందమూరి రామకృష్ణ కూడా తన ఆనందాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సంరక్షించేందుకు,పేదలు, ఆకలిగొన్న ప్రజలకు సేవలు ఆందించడానికి మన తెలుగుదేశం పార్టీ ఉందని ఆయన పేర్కొన్నారు. ‘నందమూరి తారకరామారావు పార్టీని స్థాపించిన రోజు నేడు. పార్టీ గౌరవాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత. మన తెలుగోడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. అదే బాటలో అదే రీతిలో మన రథసారథి చంద్రబాబు సారథ్యం వహిస్తున్నారు.మనందరం వారి వెంటఉండి వీరసైనికుడిలా ముందుకు నడిపిద్దాం. జై తెలుగుదేశం…. జై తెలుగునాడు…. జై జై ఎన్.టి.ఆర్…. జై జై చంద్రన్న…’ అంటూ నందమూరి రామకృష్ణ తన ఆనందోత్సాహాన్ని వ్యక్తం చేశారు.