ఏపీలో నిధులు మళ్లింపు నిరాటంకంగా కొనసాగుతోంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కార్పొరేషన్లకు కేటాయించిన వేల కోట్ల రూపాయలను నవరత్నాల పథకాల నగదు బదిలీకి మళ్లిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వాటికి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. వారందరినీ విజయవాడలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేయించి, వారిని నేరుగా ఇంటికి పంపించింది. ఎందుకంటే వారు కూర్చోవడానికి ఎక్కడా కనీసం ఒక్క కుర్చీ కూడా లేదు. కార్యాలయం, కనీస నిధులు లేకుండా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోగా ఆ కార్పొరేషన్ల ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే నిజమైతే బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటైన ఆనందం కన్నా, వారి పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీ వారిని ఎక్కువగా బాధించే అవకాశం ఉంది.
నిధులు ఎలా ఎత్తిపోశారంటే…
బీసీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కార్పొరేషన్లకు కేటాయించిన వేల కోట్ల నిధులను ప్రభుత్వం అమ్మఒడి పథకానికి మళ్లించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఈ తంతు సాగుతోంది. నవరత్నాల పథకాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికే ఉపయోగపడతాయిని, ఆ పథకాల్లోనూ వారే 90 శాతం లబ్దిదారులుగా ఉన్నారని ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. పేరుకే 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ వారు కూర్చోడానికి కనీసం కార్యాలయం కూడా లేదు. ఇక నిధుల సంగతి మరచిపోతే బెటర్. బీసీలు పదవులు వచ్చాయని ఆనందపడాలా? నిధులు, విధులు లేవని బాధపడాలా అర్థం కాకుండా తయారైంది. ఇప్పటికే సోషల్ వెల్ఫేర్, దేవాదాయ శాఖల నుంచి అమ్మఒడి , వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేదోడు పథకాలకు రూ.14 వేల కోట్లు మళ్లించారు. ఈ ఏడాది ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ.11,300 కోట్లు నవరత్నాల పథకాలకు తరలించారు. ఈ ఏడాది జనవరిలో దేవాదాయ శాఖ నిధులను రూ.56 కోట్లు, కాపు కార్పొరేషన్ నుంచి రూ.568 కోట్లు అమ్మఒడి ఖాతాలో వేశారు.
బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ ఏడాది రూ.3432 కోట్లు దారి మళ్లించారు. ఇలా ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ కార్పొరేషన్లు, దేవాదాయశాఖల నుంచి రూ.30 వేల కోట్లు మళ్లించారు. నిధుల మళ్లింపు కూడా పేదల సంక్షేమం కోసమేనని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
Must Read ;- అప్పుల వేటలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు
ఎంత ఎత్తిపోసినా ఇంకా లోటు
అందిన కాడికి అప్పులు తేవడంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రికార్డులు సృష్టించింది. అప్పులు చేయడంపై పరిశోధన చేసేందుకు ఓ విశ్రాంత ఐఏఎస్ ను ఢిల్లీ నుంచి రప్పించారు. అప్పులు ఎలా తేవాలి అనే విషయంలో ఇప్పటికే ఏపీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో లక్షా 30 వేల కోట్లు అప్పులు చేసి ఔరా అనిపించారు. కార్పొరేషన్లకు కేటాయించిన వేల కోట్లు నవరత్నాలకు మళ్లించినా, లక్ష కోట్లకుపైగా అప్పులు చేసినా, ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శాఖల వారీగా విడతల వారీగా ప్రతి నెలా 14వ తేదీ వరకూ జీతాలు జమచేస్తూనే ఉన్నాయి. ఏదో ఒక శాఖకు ఒకటో తేదీ జీతాలు వేసి, ప్రభుత్వం జీతాలు ఇచ్చిందని ప్రచారం చేసుకుంటోంది.
కొత్తగా అప్పులు చేయడం ఎలా?
రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినంత మేర అప్పులు చేసే వీలు లేదు. కేంద్ర పభుత్వం నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆయా రాష్ట్రాల జీఎస్డీపీలను పరిగణనలోకి తీసుకుని తాజాగా ఎఫ్ఆర్బీఎంను 5 శాతానికి పెంచారు. ఇక ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది జీఎస్డీపీ ఎక్కువ చూపడం ద్వారా మరింత రుణాలు చేయాలనే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీ అప్పుల కుప్పలా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఒక్కొక్కరిపై రూ.3 లక్షల అప్పుల భారం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే మూడేళ్లలో ఈ మొత్తం రూ.6 లక్షలకు చేరే ప్రమాదం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సంక్షేమం పేరుతో ఏపీ ప్రభుత్వం సంక్షోభంలో పడే ప్రమాదం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.
Also Reda ;- ఏపీకి షాకిచ్చిన కాగ్ నివేదిక రుణం తీర్చాల్సిందే