యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎర్లియర్ గా రాక్షసుడు సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టాడు. అయితే సస్పెన్స్ థ్రిల్లర్అవడం వల్ల ఆ సినిమాలో కామెడీ, రొమాన్స్ , డ్యాన్సుల్ని జనం మిస్ అయ్యారు. అందుకేనేమో వాటన్నిటినీ మిక్స్ చేసి ఒక కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ప్యాక్ లా ‘అల్లుడు అదుర్స్’ తో ఈ సంక్రాంతికి బరిలోకి దిగాడు ఆ హీరో. ఇంతకీ ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? దానికి కథాకమామిషు ఏంటో రివ్యూలో చూసేద్దాం…
కథలోకి వెళితే
శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్ ) జాలీగా జల్సగా తిరిగే యువకుడు. ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు అతడు వసుంధర అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమె కూడా శ్రీను అంటే ఇష్టం చూపిస్తుంది. ఆమె ఒకరోజు తనతో చెప్పా పెట్టకుండా.. తన ఫ్యామిలీతో ఆ ఊరినుంచి వెళ్ళిపోయిందని తెలిసి హర్ట్ అవుతాడు. అప్పటినుంచి ప్రేమ అన్నా, అమ్మాయిలన్నా అయిష్టం పెంచుకుని తన ఫ్రెండ్స్ చేత కూడా ఒట్టు వేయించుకుంటాడు.
ఒకరోజు శ్రీను ఫ్రెండ్ ( వెన్నెల కిశోర్)ని .. ఆ ఊళ్ళో అందరూ భయపడే జైపాల్ రెడ్డి (ప్రకాశ్ రాజ్ ) తన కూతురికి మెసేజ్ పంపాడని రౌడీలతో ఎటాక్ చేయిస్తాడు. వారి బారి నుంచి శ్రీను అతడ్ని కాపాడుతాడు. పోలీసుల సలహాతో .. తన ఫ్రెండ్ తో సహా జైపాల్ రెడ్డి ఇంటికెళతాడు. తనే మెసేజ్ పంపానని తప్పు తన మీద వేసుకొని అతడికిసారీ చెబుతాడు. ఆ క్రమంలో జైపాల్ రెడ్డి కూతురు కౌముది (నభా నటేష్) ని చూసి మనసు పారేసుకుంటాడు. అతడి రౌడీల్ని చితక్కొట్టి అతడి ఎదురుగానే కౌముదికి ఐ లవ్ యూ చెప్పి.. ఆమెను పదిరోజుల్లో ప్రేమలో పడేస్తానని అతడితో శపథం చేస్తాడు. మరి శ్రీను ప్రేమలో తన కూతురు పడకుండా ఉండేందుకు జైపాల్ రెడ్డి ఏం చేశాడు? శ్రీను ప్రేమించిన వసుంధర ఎవరు? మరి ఆమెను ప్రేమించిన శ్రీను కౌముది మీద ఎందుకు మనసు పారేసుకుంటాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
బిఫోర్ లాస్టియర్ సంక్రాంతికి, లాస్టియర్ సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావిపూడి… తన కామెడీ మ్యాజిక్ తో రెండు బ్లాక్ బస్టర్స్ కైవసం చేసుకున్నాడు. సంక్రాంతి సీజన్ ను కామెడీతో కూడా కేప్చర్ చేయవచ్చని నిరూపించాడు. అది దృష్టిలో పెట్టుకొనే ఏమో .. అనిల్ గురువు సంతోష్ శ్రీనివాస్ ..తన శిష్యుడి ఇన్ పుట్స్ తో అదే కామెడీ అస్త్రాన్ని అల్లుడు శ్రీను సినిమాతో ఈ సంక్రాంతికి ప్రయోగించాడు. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ కామెడీతో జిమ్మిక్కులు చేయాలనిచూశాడు. అయితే కామెడీ అయితే బాగానే పేలింది కానీ.. కథా కథనాలు.. పక్కదారి పట్టాయి. సినిమాలో బలమైన కాన్ఫ్లిక్ట్ లాంటిది ఏమీ లేకుండా పోయింది. బెల్లంకొండ హీరోయిజం ఎలివేషన్లు , బిల్డప్పులతోనే సగం కథ నడిచింది. అయితే ఈ సినిమా నడక చూస్తే మాత్రం ‘కందిరీగ’ సినిమాని సంతోష్ రివర్స్ చేసి తీశాడని అనిపించకమానదు.
‘కందిరీగ’లో ఒక రౌడీ తను ప్రేమించిన అమ్మాయి కోసం హీరోను వేరే విలన్ డెన్ లోకి వెళ్ళేలా రెచ్చగొడతాడు. ‘అల్లుడు శ్రీను’ లో దానికి రివర్స్ గా.. ఒక విలన్ లాంటి పాత్ర హీరో తన కూతురిని ప్రేమించిన కారణంగా .. అతడ్ని వేరే రౌడీ మీదకు ఉసిగొల్పుతాడు. ఈ రెండు సినిమాల్లోనూ సోనూ సూద్ నే రౌడీ కావడం విశేషం. కాకపోతే.. అందులో జయప్రకాశ్ రెడ్డి విలన్ గా నటిస్తే.. ఇందులో ప్రకాశ్ రాజ్ విలన్ గా నటించాడు. అందులోనూ, ఇందులోనూ హీరో ఇంచుమించు ఒకేరకమైన మైండ్ గేమ్ ప్లాన్ చేస్తాడు. రెండింట్లోనూ విలన్ కు ఇద్దరు కూతుళ్ళు. అందులో ఒక కూతురిని సోనూ సూద్ పెళ్ళిచేసుకుంటాడు. అయితే ఇందులో సోనూ సూద్ పాత్రను చాలా కామెడీగా తీసుకెళ్ళి చివరిలో లేపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అంతగా పేలలేదు. అయితే అప్పుడు కందిరీగ హిట్టవ్వడానికి ఎన్నో అంశాలు కలిసొచ్చాయి. కానీ ఈ అల్లుడు సంక్రాంతి రేసులో నిలవడం కష్టం అనిపిస్తోంది.
ఇక హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో కొత్తగా కామెడీ కూడా చేయడం విశేషమని చెప్పాలి. అలాగే హీరోయిన్ నభా నటేశ్ తన పాత్రను చాలా హాట్ గానూ, బోల్డ్ గానూ పోషించింది. కానీ అనూ ఇమ్మాన్యుయేల్ కు చాలా తక్కువ స్పేస్ ఇచ్చాడు దర్శకుడు. ఇక జయపాల్ రెడ్డిగా నటించిన ప్రకాశ్ రాజ్ విలనిజంతో పాటు కామెడీని కూడా బాగా పండించాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మాజీ, సప్తగిరి, సత్య, జబర్దస్త్ కమెడియన్స్ కామెడీని బాగా పండించారు.
హైలైట్స్ : మ్యూజిక్ , నభా నటేష్ గ్లామర్, కామెడీ టైమింగ్
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేష్, ప్రకాశ్ రాజ్, సోనూ సూద్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, రచ్చ రవి, ఇంద్రజ, అనిష్ కురువిల్లా తదితరులు..
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
కెమెరా : ఛోటా కె నాయుడు
ఎడిటింగ్ : తమ్మిరాజు
నిర్మాణం : సుమంత్ మూవీ ప్రొడక్షన్స్
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ రౌతు
విడుదల : 14 -1-2021
ఒక్కమాటలో : ‘అల్లుడు అదుర్స్’ .. ‘కందిరీగ’కు రివర్స్
రేటింగ్ : 2 / 5
-ఆర్కే