ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మారనున్నాయి. తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతోపాటు రానున్న కాలంలో బీజేపీ ప్రశాంత్ కిషోర్‌ని టార్గెట్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. 2012 నుంచి పలు మార్లు బీజేపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేశారు. మోడీ ప్రధాని కావడం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాల పాత్ర ఉందని కూడా చెబుతారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్‌లో జేడీయూ, ఏపీలో వైసీపీ ఇలా పలు రాష్ట్లాల్లో పార్టీలకూ వ్యూహకర్తగా పని చేశారు. అయితే, పార్టీపరంగా సేవలందించారు తప్ప..బీజేపీపై డైరెక్ట్‌గా విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ రెండంకెలకు మించి సీట్లు సాధించలేదని, ఒక వేళ అలా సాధిస్తే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటాననని ట్వీట్ చేశారు. అంతే కాకుండా మీడియాను మేనేజ్ చేస్తే చాలు..ఓట్లు పడతాయని బీజేపీ భావిస్తోందని, పశ్చిమ బెంగాల్‌లో అది జరగదని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్‌పై బీజేపీ ఫాలోవర్లు దాడి మొదలు పెట్టారు.
మారుతున్న రాజకీయం..
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ పోరు తారస్థాయికి చేరింది. త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్ కమలం కూడా మొదలు పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పర్యటించారు. రానున్న కాలంలో ప్రధాని మోడీ కూడా పలు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు బీజేపీ ప్రణాళిక వేసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ..బీజేపీ తన వ్యూహంతో టీఎంసీ లీడర్లను చేర్చుకుంటోంది. ఆ పార్టీ ఎంపీలను, పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే తమ వైపు తిప్పుకుంది. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ఎంపీ సునీల్ మండల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. ఆయన ప్రశాంత్ కిశోర్‌ను అద్దె పోరాట యోధుడిగా అభివర్ణించారు. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన మరో సీనియర్ నేత సువెందు అధికారి మమత బెనర్జీతో పాటు పరోక్షంగా ప్రశాంత్ కిషోర్‌పైనా విమర్శలు చేశారు. టీఎంసీలో తెగులు, చెదలు విపరీతంగా ఉందని, తమ తరువాత వచ్చిన పార్టీ ఇన్ ఛార్జీలు పార్టీని తమ సొంత ఆస్తిగా పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలతో టీఎంసీ ప్రతి వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్లో 64 సీట్లలో ప్రభావం చూపుతుందని అంచనా ఉన్న MIMతో కలిసి పోటీచేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందనేది తేలాల్సి ఉంది.
Must Read ;- సంపాదకీయం : మోడీజీ.. మీ జిమ్మిక్ పనిచేస్తుందా?
దశాబ్ధ కాలం తరువాత..
దశాబ్ధకాలం తరువాత మమత బెనర్జీకి ఇలాంటి రాజకీయ పరిస్థితి ఎదురైంది. గతంలో వామపక్షాల నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వామపక్షాలతో పోరాడి సాధించిన టీఎంసీ..ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీతో పోరాడాల్సి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో భాగంగానే.. పార్టీ కేడర్ లో జోష్ నింపేలా ప్రశాంత్ కిషోర్‌ని డైరక్ట్‌గా రంగంలోకి దింపిందని భావిస్తున్నారు.
డైరక్ట్ అటాక్..
ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి వ్యూహకర్తగా పని చేసినా.. ఇంటర్వ్యూల్లో తప్ప.. డైరెక్ట్ అటాక్ సందర్భాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. మమత బెనర్జీ పార్టీకి వ్యూహకర్తగా ఈ ఏడాది మే నెల నుంచి పని చేస్తున్నా.. బీజేపీపై బహిరంగంగా, ప్రత్యక్షంగా సవాలు చేసే స్థాయిలో మాత్రం విమర్శలు చేయలేదు. కాని తాజాగా బీజేపీ రెండంకెలకు మించి సీట్లు సాధిస్తే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. ఇందుకు పలు కారణాలున్నాయని తెలుస్తోంది. టీఎంసీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు వ్యూహకర్తగా తన పట్టును నిరూపించుకోవడం ఇక్కడ తప్పనిసరి అవసరంగా కనిపిస్తోంది. అదే సమయంలో రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఉందని కూడా చెప్పవచ్చు.
ట్విట్టర్ నుంచే కాదు..మొత్తం క్లోజ్
పలు రాష్ట్రాల్లో తన వ్యూహాలతో పార్టీలకు అధికారాన్ని అప్పజెప్పిన ప్రశాంత్ కిషోర్‌కి పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలుపుపై పూర్తి విశ్వాసం ఉన్న నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేసి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే ఆయనకు మరింత క్రేజ్ వస్తుంది. రాజకీయంగా బీజేపీతో ఆయన డైరెక్ట్‌గా పోరాడాల్సి ఉంటుంది కాని అది తరువాతి సంగతి. ఒకవేళ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ మూడంకెల సీట్లు..అంటే వందకి మించి సాధించినా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫెయిల్ అయ్యాయని భావించవచ్చు. అదే జరిగితే.. రాజకీయ వ్యూహకర్తగా కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి తప్పదనే చర్చ మొదలైంది. రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అలాంటిది ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్‌గా నెంబర్ గేమ్ మొదలు పెట్టడాన్ని బట్టి.. వ్యూహకర్తగా కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారని చెప్పవచ్చు.
Also Read ;- దారుస్సలాం ఎఫెక్ట్.. దీదీ లొంగుతుందా?