పోలవరం ప్రాజెక్టుకు కాగల వ్యయం, కేంద్రంనుంచి అందగల సహకారం గురించి కొన్ని రోజులుగా గందరగోళం రేగుతోంది. తాజా అంచనాల ప్రకారం చెల్లించాల్సిందిగా రాష్ట్రం కోరుతోంటే.. 2014 అంచనాల ప్రకారం ఇస్తామని కేంద్రం చెబుతోంది. తాజాగా పునరావాసానికి రూపాయి కూడా చెల్లించేది లేదని కూడా కేంద్రం తేల్చిచెప్పేసింది. రాష్ట్రం ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? అనేదే ఇప్పుడు ప్రధాన చర్చ.
సహజంగానే తెలుగుదేశం- వైసీపీ రెండూ కూడా ఒకరి మీద ఒకరు వైఫల్యాన్ని నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆరోజున తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని వైసీపీ అంటోంది. కేంద్రంనుంచి నిధులు సాధించి తెచ్చుకోవడం వైసీపీకి చేతకావట్లేదని టీడీపీ ఆరోపిస్తోంది.
ఇలాంటి రాజకీయ ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఈ గండం గడిచి రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా బయటపడాలంటే.. అయినకాడికి ఇక్కడితో తప్పుకుని.. జాతీయ ప్రాజెక్టు గనుక.. ప్రాజెక్టును మీరే పూర్తి చేసుకోండి అని రాష్ట్రం చేతులు దులుపుకోవడమే మంచిదనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తం అవుతున్నాయి.
పోలభారం ఎలాగైంది?
రాష్ట్ర విభజనకు పూర్వమే పోలవరం పనులు ప్రారంభం అయ్యాయి. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది గనుక.. అందుకు కాంపన్సేషన్ అన్నట్టుగా.. పోలవరం ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. దాని నిర్మాణానికి అవసరమయ్యే ప్రతి రూపాయి కేంద్రమే భరిస్తుందని చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులతో, వారి తరఫున రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారు. కేంద్రం చాలా కనిష్ట స్థాయిలో నిధులు విడుదలచేస్తూ పనులు వేగంగా సాగకపోవడానికి ఒక కారణం అయింది. తీరా పనులు వేగం పుంజుకుంటున్న సమయంలో.. ప్రభుత్వం మారింది. పనులు ఆగిపోయాయి. కాంట్రాక్టులను రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వ్యయం కొంత తగ్గించి.. కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయి. తాజాగా నిధుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఇందులో ఎంత సంక్లిష్టత ఉన్నదో బయటకు వచ్చింది.
రాష్ట్రం వదిలించుకోవాల్సిందే..
నిర్మాణానికి అయ్యే ఖర్చు మాత్రం.. అది కూడా 2014 లెక్కల ప్రకారం ఇస్తానని కేంద్రం అంటున్నది. పునరావాసానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటున్నది. అయితే ఇంకా రాష్ట్రప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టుకుని వేళ్లాడ్డం ఎందుకు? ఈ ప్రాజెక్టును కేంద్రమే నిర్మించేలా వారికి అప్పగించేయడమే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రప్రభుత్వం ఇటీవలే మెగా కంపెనీకి పోలవరం పనులు అప్పగించారు. అవి అలా కొనసాగాలని రాష్ట్రప్రభుత్వం పట్టుబడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇప్పటికే పునరావాసం ఖర్చు ఇవ్వం అని తెగేసి చెబుతున్నారు. ముందుముందు ఎన్నెన్ని చికాకులు పెడతారో తెలియదు. ఈ ధశలో నిర్మాణ నిర్వహణ మొత్తం కేంద్రానికే ఇచ్చేసి వెనక్కు తగ్గడం మంచిదని పలువురు అంటున్నారు. రాష్ట్ర ఖజానా మీద మరింత భారం మోపకుండా తప్పించుకున్నట్టు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వాళ్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం పనుల నిర్వహణ విషయంలో ఒకసారి చంద్రబాబునాయుడు తప్పు చేశారని, జగన్ కూడా నా కాంట్రాక్టర్లు ఉన్నారు.. వారే పనులు చేయాలని అనుకుంటే.. మళ్లీ బురద రాజకీయం తప్పదని.. కేంద్రానికి ఇచ్చేయడం మంచిదని దగ్గుబాటి అంటున్నారు.
పోలవరం విషయంలో సంక్లిష్టత నానాటికీ పీటముడిలాగా బిగుసుకుంటున్న తరుణంలో.. జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయంతో పరిస్థితులను చక్కదిద్దుతుందో చూడాలి.