బ్యాంకులు,ఆర్థిక సంస్థలు లేదా ఏదేని సర్వీసు కోసం వెతికేవారు గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇందుకు సంబంధించి ఇటీవల ఇలాంటి కేసులు పెరిగిపోతున్న విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు.అప్రమత్తంగా ఉండడం,పాస్ వర్డ్‌లు,ఓటీపీలు లేదా ఏదేని ఇతర వివరాలు బయటకు వెల్లడించకపోవడంతో పాటు పబ్లిక్ వైఫై లేదా పబ్లిక్ ఇంటర్నెట్ సేవలను వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.ఇటీవల సైబర్ నేరగాళ్లు కస్టమర్ కేర్ సర్వీసుల పేర్లతో ఫేక్ ఫోన్ నెంబర్లను పొందుపర్చుతున్నారని తెలిపారు.
వాళ్లు చెప్పినట్లు చేస్తే..
పంజాబ్,హరియాణా,ఉత్తరప్రదేశ్,బీహార్,ఝర్ఖండ్‌కు చెందిన వారు కస్టమర్ కేర్ ప్రతినిధుల్లా మాట్లాడుతూ ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.హైదరాబాద్‌లోని కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గూగుల్ సెర్చ్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ కస్టమర్ సర్వీసు నెంబరు సేకరించి మాట్లాడగా అవతలి వ్యక్తి చెప్పినట్టు చేయడం, టీమ్ వ్యూయర్‌ని ఇన్ స్టాల్ చేయడం,క్విక్ సపోర్ట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా రూ.1.6లక్షలు కోల్పోయాడని గుర్తు చేశారు.క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు సమయంలో ఎదురైన సమస్యను వివరించేందుకు కస్టమర్ కేర్ సర్వీసుకు ఫోన్ చేశాడని,అయితే అనధికార నెంబరుకు ఫోన్ చేయడంతో మోసపోవాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.మరో కేసులో బాలానగర్‌కు చెందిన వ్యక్తి ఫోన్ పే ద్వారా వేరే వ్యక్తికి డబ్బులు చెల్లించాలని,అయితే లావాదేవీ విఫలం కావడంతో గూగుల్‌లో వెతికి ఓ నెంబరు కనిపించడంతో ఫోన్ చేశాడని,అయితే అవతలి వ్యక్తి ఫోన్ పే డిటైల్స్ అడగడంతో పాటు ఎనీడెస్క్ యాప్ ని డౌన్ లోడు చేసుకోవాలని చెప్పడంతో బాధితుడు అలాగే చేశాడని చెప్పారు.ఐదు లావాదేవీల ద్వారా రూ.72,902 మోసపోయాడని చెప్పారు.ఈ మోసగాళ్లు తొలుత రూ.1 గూగుల్ పే ఖాతాకు బదిలీ చేయమని కోరతారని,ఆ సమయంలోనే పాస్ వర్డ్ లు,వివరాలు చోరీ చేస్తారని అన్నారు.ఆర్థిక లావాదేవీల విషయంలో బ్యాంకుల అధికారిక నెంబర్లకు మాత్రమే సంప్రదించాలని,ఎనీ డెస్క్,టీమ్ వ్యూయర్,క్విక్ సపోర్టు యాప్‌లతో పాటు పిన్‌లు, ఓటీపీలు చెప్పడం చేయవద్దని తెలిపారు.
జొమాటో లాంటి వాటిల్లోనూ..
ఇక ఇటీవలే మరో తరహా కేసు కూడా నమోదైంది.రహ్మత్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు జొమాటోలో బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా అతనికి సాధారణ భోజనం డెలివరీ అయింది.అతను జొమాటోకు ఫిర్యాదు చేసేందుకు గూగుల్‌లో నెంబరు వెతికాడు.అక్కడ కనిపించిన నెంబరుకు ఫోన్ చేశాడు.కస్టమర్ కేర్ సర్వీసులానే మాట్లాడిన మోసగాళ్లు.. సదరు యువకుడికి కొన్ని సూచనలు చేశారు.ఆ సూచనలు ఫాలో కావడంతో పాటు కొన్ని వివరాలు చెప్పడంతో రూ.50,000 పోగొట్టుకున్నాడు.
ఇలాగయితే భద్రం..
కాగా పోలీసులు,సైబర్ నిపుణులు ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నారు.గూగుల్‌లో నెంబర్లు వెతికే విషయంలో జగ్రత్తగా ఉండడంతో పాటు ఏ కంపెనీ కూడా ఓటీపీలు,లేదా ప్రత్యేకంగా పంపిన క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేయమని కోరదని చెబుతున్నారు.వారు పంపిన లింక్‌లను ఓపెన్ చేసే విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు.వీటితోపాటు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు ఉంటే వెంటనే బ్యాంకు అధికారిక వెబ్ సైట్ లేదా బ్యాంకు వెళ్లడం ఉత్తమమని చెబుతున్నారు.అదే సమయంలో బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం,ఒకే పాస్ వర్డ్ అన్నిచోట్లా వాడడం లేదా సులువైన పాస్ వర్డ్ (బర్త్ డే,12345678 లాంటివి) పెట్టవద్దని చెబుతున్నారు.ఇక అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్ పెట్టుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నారు.పబ్లిక్ వైఫై వినియోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని,అనధికార వ్యక్తులు లేదా మెయిళ్లకు వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.ఇంటర్నెట్ సెక్యూరిటీ (ఉదాహరణకు ఎయిర్ టెల్ సెక్యూర్ )ముఖ్యమని చెబుతున్నారు.ఇక చెల్లింపులు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని,అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని చెబుతున్నారు.ఇక ఫోన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లయితే అప్ డేటెడ్ వెర్షన్‌తో పాటు ఎప్పటికప్పుడు భద్రతను సరిచూసు కోవాలని చెబుతున్నారు.ఇక అవగాహన ఉన్నవారు VPN లేదా (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) ఆధారిత సేవలను వినియోగించుకోవాలని చెబుతున్నారు.