నాలుగు గంటల వ్యవధిలోనే వైసీపీ పేటీఎమ్ బ్యాచ్, జగన్ సోషల్ మీడియా టీమ్ ఆశలపై నీళ్లు చల్లాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణ అల్లుడు భాను కోగంటి.. ఉదయం చేసిన ఒక ట్వీట్లో వైసీపీ పేటీఎమ్ పండగ చేసుకుంది.. దీపావళి క్రాకర్స్ పేల్చుకుంది ముందుగానే.. నాలుగు గంటల్లోనే మరో ట్వీట్‌తో ఆ టపాసులను తుస్సుమనిపించాడు భాను కోగంటి..
సోషల్ మీడియాలో కొన్నిసార్లు చిన్న ట్వీట్లు కూడా పెద్ద దుమారాన్ని రేపుతుంటాయి. సరిగ్గా అలాంటి ఘటనే వేమూరి రాధాకృష్ణ అల్లుడు భాను కోగంటి పెట్టిన ట్వీట్ల విషయంలో జరిగింది. ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలకు, తప్పుడు ప్రచారాలకు దారితీసింది. అయితే, తన రెండో ట్వీట్‌తో ఆ రూమర్లన్నింటికీ భాను కోగంటి స్వయంగా తెరదించి, అసలు విషయం ఏమిటో స్పష్టం చేశారు.
భాను కోగంటి తన అధికారిక X ఖాతాలో #OwnHouse అనే హ్యాష్‌టాగ్‌తో పాటు కొందరు మీడియా వ్యక్తులు తమ సొంత ఇళ్లలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా, పక్క ఇళ్ల వైపు చూడటంలోనే బిజీగా ఉంటారంటూ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బయటకు రాగానే సోషల్ మీడియా విశ్లేషకులు, కొన్ని వ్యతిరేక వర్గాలు దీన్ని రాధాకృష్ణను, ABN సంస్థను ఉద్దేశించి చేసిన విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. రాధాకృష్ణ తన అల్లుడిని బాధ్యతల నుంచి తప్పించారంటూ, ఇంట్లోనే గొడవలు జరుగుతున్నాయంటూ నెట్టింట రకరకాల ఊహాగానాలు వైరల్ చేయడం ప్రారంభించారు.
తన ట్వీట్‌ను వక్రీకరించి జరుగుతున్న ప్రచారాన్ని గమనించిన భాను కోగంటి..వెంటనే మరో ట్వీట్ ద్వారా ఆ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. నా మొదటి ట్వీట్‌ను చాలా మంది సోషల్ మీడియా విశ్లేషకులు, వెబ్సైట్లు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. నా ఉద్దేశం వేరే ఉంది, అది మా మీడియా సంస్థను అంటే ABNను ఉద్దేశించి కాదు. ఆ సందేశం ఏ మీడియా హౌస్‌కు వెళ్లాలో అక్కడికి స్పష్టంగా చేరిందని తేల్చిచెప్పారు.
అంతేకాకుండా, తాను ఇప్పటికీ ఆమోద బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ – ABN లో భాగస్వామిగానే కొనసాగుతున్నానని, కేవలం సంస్థలో అంతర్గత బాధ్యతల మార్పు మాత్రమే జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఫాలోవర్లు పెరిగేందుకు కారణమైన సోషల్ మీడియా విశ్లేషకులు, రాజకీయ ఆసక్తి ఉన్నవారందరికీ సెటైరికల్‌గా ధన్యవాదాలు తెలిపారు. ఈ క్లారిటీతో ABN సంస్థపైన, ఎండీ రాధాకృష్ణ కుటుంబంపై పనిగట్టుకుని జరుగుతున్న దుష్ప్రచారానికి ఒక్కసారిగా చెక్ పడినట్లయింది.











