పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏదైనా నచ్చిందంటే అది సినిమాలో ఉండి తీరాల్సిందే. ఇప్పుడు ఆయన భీమ్లా నాయక్ చిత్రం కోసం కిన్నెర సంగీత కళను ఎంచుకున్నారు. తన సినిమాలోని టైటిల్ సొంగ్ పాడినందుకు కిన్నెర కళాకారుడు మొగులయ్యకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేయండం విశేషం. పవన్‌కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ సంస్థ ద్వారా ఆయన ఈ సాయం అందజేశారు. జానపద కళాకారులను నేటి తరానికి పరిచయం చేయాలనే తపనతోనే ఆయన ఇలాంటి వారిని మొదట్నుంచీ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. చాలామందికి అర్థం కానిదేమిటంటే కిన్నెర కళ ఏమిటనేది.
కిన్నెర అనేది ఓ తంత్రీ వాయిద్య పరికరం. దీనికి అనేక తంత్రులు ఉంటాయి. గిరిజన జాతులవారు దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ పరికరం సాయంతో జానపద పాటలు ఆలపిస్తూ ఉండే కళాకారులు చాలామందే ఉన్నారు. వారిలో మంచి పేరు తెచ్చుకున్న వారు మొగులయ్య. అతనికి తండ్రి నుంచి వారసత్వంగా ఈ కళ వచ్చిందట. అతని తండ్రి ఎల్లయ్య నుంచి ఈ కళను నేర్చుకుని జనంలోకి పాటను తీసుకు వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లా లింగ మండలంలోని అసలికుంట అతని స్వగ్రామం.
తెలంగాణలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అతని పాట ఎంతో ప్రసిద్ధిచెందింది. యూట్యూబ్ లో ఇప్పుడు బీమ్లానాయక్ కోసం అతను పాడిన పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కిన్నెర వాయిద్యం వాయిస్తూ భీమానాయక్ పుట్టుపూర్వోత్తరాల తెలిపేలా ఈ పాట వస్తుంది. మొగులయ్య లోని ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కూడా అతన్ని ఉగాది పురస్కారంతో సత్కరించింది. ఎనిమిదో తరగతి సోషల్ సబ్జెక్టులో అతని జీవిత చరిత్రను పాఠ్యాంశంగానూ చేర్చింది. ఇప్పటిదాకా చాలామందికి తెలియని మొగులయ్య పేరు భీమ్లా నాయక్ పాట ద్వారా తెలిసింది. సినిమా మాధ్యమానికి ఉన్న పవర్ ఏమిటో దీనివల్ల రుజువైంది.











