వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన 500 ఎకరాలను కాజేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీవ్ర కుట్రలు చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. తన స్వప్రయోజనాలు, విలాసాల కోసం రూ. 500 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేసి రుషికొండపై రాజప్రాసాదాన్ని నిర్మించుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పట్లో విశాఖ నగర ప్రగతికి రూపాయి కూడా ఖర్చు చేయని వైసీపీ నాయకులు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే సేవ్ వైజాగ్ అంటూ కొత్త నాటకాలకు తెరతీశారని గంటా దుయ్యబట్టారు.
ఒకవైపు కూటమి ప్రభుత్వం నారా లోకేష్ ప్రత్యేక చొరవతో విశాఖ నగరానికి ఐటీ దిగ్గజమైన గూగుల్ సంస్థను, డేటా సెంటర్లను తీసుకువచ్చి నవశకానికి నాంది పలికితే..జగన్ మాత్రం అప్పట్లో గం*జాయి మాఫియాను ప్రోత్సహించి నగరాన్ని నేరమయంగా మార్చారని గంటా ఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి స్థలమిచ్చి కూటమి ప్రభుత్వం ఆంధ్రుల కలను సాకారం చేసిందని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటూ భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ఎడమ కాలువ ద్వారా 30 టీఎంసీల గోదావరి జలాలను ఉమ్మడి విశాఖ జిల్లా దాహార్తి తీర్చడానికి అందిస్తున్నామని వివరించారు.
విశాఖలో జరుగుతున్న ఈ అభివృద్ధి సంక్షేమాలను చూసి ఓర్చుకోలేకే వైసీపీ నేతలు గూగుల్ సంస్థ, డేటా సెంటర్లపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2014 ఎన్నికల్లో తన తల్లిని విశాఖ ప్రజలు ఓడించారన్న ఏకైక కక్షతోనే జగన్ ఈ ప్రాంతంపై పగబట్టారని ఆరోపించారు. ఆ కక్షసాధింపు ధోరణితోనే ఉత్తరాంధ్ర నుంచి ఎన్నో పరిశ్రమలను వెళ్లగొట్టి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో నిలబెట్టారని శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ పరిణామాలన్నీ గమనిస్తే విశాఖకు ఏది నిజమైన అభివృద్ధో స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో గంజాయి మాఫియాను పెంచి పోషించి, రుషికొండ ప్యాలెస్‌లు నిర్మించుకుంటూ పరిశ్రమలను తరిమేసిన జగన్ మార్క్ ఒకవైపు ఉంటే.. గూగుల్ లాంటి గ్లోబల్ ఐటీ సంస్థలను తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ విశాఖను గ్లోబల్ హబ్‌గా మారుస్తున్న నారా లోకేష్, కూటమి ప్రభుత్వ మార్క్ మరోవైపు కనిపిస్తోంది.











