మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ మూవీ వేదాళం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి నటించిన సినిమా ఇది. ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
యువతుల కిడ్నాప్ ఇందులో ప్రధాన కథాంశం. శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి ( కీర్తి సురేష్)ను తీసుకుని కలకత్తా వస్తాడు. చిత్ర లేఖనం మీద మక్కువ ఉండే మహాలక్ష్మితో మాస్టర్స్ డిగ్రీ చేయించడం కసం అక్కడ యూనివర్శిటీలో చేర్పించి తను టాక్సీ డ్రైవర్ గా చేరతాడు. అక్కడ లాస్య (తమన్నా) చిరుకు పరిచయమవుతుంది. లాస్య సోదరుడు సుశాంత్ చిరు చెల్లెలు మహాలక్ష్మిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. మరో పక్క విమన్ ట్రాఫికింగ్ ముఠాను చిరు మట్టుపెడుతుంటాడు. ఆ ముఠాకు చిరుకు లింకు ఏమిటి? ఎందుకు చిరు అలా చేయాల్సి వస్తుంది? తన చెల్లి పెళ్లిని సుశాంత్ తో జరిపించాడా లేదా? లాంటి అంశాలతో కథ ముగుస్తుంది. కథ, కథనాల్లో పసలేకపోవడంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా సినిమా ముందుకు సాగుతుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
చిరంజీవి ఎలా చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అరవై పైబడిన వయసులోనూ ఉత్సాహంగా నటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చిరు వన్ మ్యాన్ షో. ఎలా తీశారు అనే అంశం దగ్గరే చిక్కు వచ్చి పడింది. ఎలాంటి కథను ఎంచుచున్నా ఆసక్తికరంగా చెప్పలేకపోవడం దర్శకుడి ఫెయిల్యూర్ గానే చెప్పాలి. ఎక్కడా ఫీల్ లేకుండా కథ ముందుకు సాగుతుంది. డైలాగుల్లో పసలేదు. మిల్కీ బ్యూటీ, జాంజాం జజ్జనక పాటలు బాగున్నాయి. వాటికి చిరు డ్యాన్సులు బాగున్నాయి. మహతి స్వరసాగర్ బాణీలు ఆకట్టుకున్నాయి. ఖుషి సీన్ ఆకట్టుకుంది. శ్రీముఖితో ఈ సిన్నివేశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేసే సన్నివేశాలు కొంత అలరించాయి.
నిర్మాత ఖర్చు పరంగా వెనుకాడలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టును ఫ్లాప్ డైరెక్టర్ చేతిలో పెట్టడమే తప్పు అని చెప్పావచ్చు. అది చిరంజీవి భోళాతనమే. ఆ భోళాతనం వల్లే సినిమాకు అవసరం లేని పాత్రలను సృష్టించి అవకాశాలను కల్పించినట్టు తెలుస్తోంది. వెన్నెల కిషోర్ నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. బ్రహ్మానందం జడ్జిగా ఒక్క సన్నివేశానికే పరిమితమయ్యారు. విలనిజం కూడా పేలవంగా ఉంది. హీరో చేతిలో తన్నుల తినడమే వీరి పని. పాత చింతకాయ పచ్చడి కథను తీసుకుని ఎలా పడితే అలా తీయడం వల్ల మెహర్ ప్రయోగం బెడిసి కొట్టింది.
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, తులసి, మురళీ శర్మ, రవి శంకర్, సుశాంత్, గెటప్ శ్రీను, రష్మీ, బ్రహ్మానందం తదితరులు.
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
కెమెరా: డుడ్లే
నిర్మాత: అనిల్ సుంకర
దర్శకత్వం: మెహర్ రమేష్
విడుదల తేదీ: 11 ఆగస్టు 2023
ఒక్క మాటలో: రాడ్ రం‘భోళా శంకర్’
రేటింగ్ : 2/5