ఎన్నికల బరిలో దిగడమంటే కేవలం మైకు పట్టుకుని ప్రచారం చేయడం మాత్రమే కాదు..కరపత్రాలు ముద్రించాలి, మైక్ సెట్లు ఏర్పాటు చేయాలి, వెంట వచ్చి చెమటోడ్చే కార్యకర్తలకు ఆతిథ్యం ఇవ్వాలి, భోజనాలు సమకూర్చాలి. ఇవన్నీ జరగాలంటే భారీగా నిధులు కావాలి. సాధారణంగా పార్టీ హైకమాండ్, నియోజకవర్గ పెద్దలు ఇలాంటి విషయాల్లో అభ్యర్థులకు అండగా నిలుస్తారనే భరోసాతోనే చాలామంది పోటీకి దిగుతారు. కానీ, తిరుపతి కార్పొరేషన్ పరిధిలో వైసీపీ అభ్యర్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. తిరుపతిలో వైసీపీకి అన్నీ తానై నడిపించిన భూమన కరుణాకర్‌రెడ్డి వర్గం అభ్యర్థులను గాలికొదిలేయడం, ఆర్థిక భరోసా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు కర్మరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు.
నామినేషన్ల ఘట్టం పూర్తయ్యే వరకు ఉత్సాహంగా కనిపించిన వైసీపీ నేతలు..తీరా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాల్సిన సమయానికి చేతులెత్తేశారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలంటే చేతిలో చిల్లిగవ్వ లేక, అటు పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందక అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గెలుపోటములు పక్కన పెడితే.. కనీసం కరపత్రాలు ముద్రించుకోవడానికి, పబ్లిసిటీ ఖర్చులకైనా పార్టీ ఆదుకోకపోతే ఎలా అంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం స్పష్టమైన ఆర్థిక, నైతిక మద్దతు ఇవ్వకపోవడంతో పోటీకి ముందే వైసీపీ క్యాంప్‌లో నైరాశ్యం అలముకుంది.
మొత్తం 66 స్థానాలకు సంబంధించి వైసీపీ విడుదల చేసిన రెండు జాబితాలు పార్టీలోని విభేదాలను రచ్చకెక్కించాయి. మొదటి జాబితా, రెండో జాబితా పేరుతో చేసిన రచ్చ చాలదన్నట్టు..సొంత పార్టీ నేతలే ఒకరికాళ్లు ఒకరు లాక్కుంటున్నారు. వైసీపీలో ఉన్న ఓ కీలక నాయకుడు, పార్టీ అధికారిక అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా తన స్వంత బంధువుకు వేరొక డివిజన్ నుంచి పోటీగా నామినేషన్ వేయించడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు సొంత నేతల నుంచే అసమ్మతి సెగలతో తిరుపతి వైసీపీ అభ్యర్థుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రచారం ఊపందుకోలేదు. పెద్దగా ఖర్చు చేయలేక, నామమాత్రంగా ప్రచారం ముగించేద్దామనే ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. అసలు భూమన వంటి ప్రధాన నాయకులు ప్రచారానికి వస్తారా..? లేదా తమ సొంత ఖర్చులతో వారిని పిలిపించుకోవాలా..? అనే దానిపై అభ్యర్థులకు ఏమాత్రం స్పష్టత లేదు. నమ్ముకుని బరిలోకి దిగితే భూమన చేతులెత్తేశారు.. ఇక మా గెలుపోటములు దైవాధీనమే అని వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు.











