జో బైడెన్.. అమెరికా 46వ అధ్యక్షుడు. అంటే.. దాదాపు కొత్త ప్రపంచాధినేత. ఆయన ఈ స్థాయికి ఎదగడం వెనుక.. 33 ఏళ్ల అవిశ్రాంత కృషి దాగుంది. చిన్న వయస్కుడైన అమెరికా అధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కాల్సిన ఆయన.. అత్యంత వృద్ధుడైన అమెరికా అధ్యక్షుడిగా నిలిచాడు. 1988, 46 ఏళ్ల వయసులో తొలిసారి అధ్యక్ష పదవికి పోటీచేసి ఒక్క శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పోటీ చేసేందుకు ఆయనకు 32 ఏళ్లు పట్టింది.
మధ్యతరగతి నుండి అగ్రరాజ్యాధినేతగా ఎదిగాడు..
1942లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో బైడెన్ జన్మించారు. అతి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం నుంచి అగ్రరాజ్యాధినేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం.. సాఫీగా ఏం సాగలేదు. అడుగడుగునా కష్టాలు.. అంతా బాగుంది! అనుకునేంతలోనే కన్నీళ్లు. చిన్నతనంలో వెక్కిరింతలు. వీటన్నింటినీ ఎదిరించి, మొక్కవోని దీక్షతో కృషి చేసి.. ఈ స్థాయికి చేరుకున్నారు. మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. అగ్రరాజ్యాన్ని శాసిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయన ప్రస్థానం.. యువతకు ఆదర్శం.
తండ్రి మాటలే స్ఫూర్తి..
బైడెన్ చిన్నతనంలో నత్తితో ఇబ్బంది పడేవారు. మాట సరిగా పలికేది కాదు. దీంతో.. స్కూల్లో సహచర విద్యార్థులు ఆయన్ను ఆట పట్టించేవారు. దీంతో.. చిన్నారి బైడెన్.. మనస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయన తండ్రి ఆసరాగా నిలబడ్డారు. మానసిక ధైర్యాన్నిచ్చారు. ‘మనిషిని అంచనా వేయాలంటే.. అతడు ఎన్ని సార్లు కిందపడ్డాడు అన్నది చూడకూడదు. ఎంత వేగంగా లేచి నిలబడ్డాడు అన్నదే చూడాలి’ అన్న తండ్రి మాటలు.. బైడెన్ మనసులో అలా నిలిచిపోయాయి. ఎప్పటికప్పుడు ఆ మాటల స్ఫూర్తితోనే ఆయన ముందడుగు వేశారు. ఆయనలో నత్తిని జయించాలనే పట్టుదల పెరిగింది. అనతికాలంలోనే ఆ సమస్యను అధిగమించారు.
Must Read ;- భారతీయ అమెరికన్లకు కీలక పదవులు.. వైట్ హౌస్‌లో మనవాళ్లే 17మంది

ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు బైడెన్‌కు. ఆ తర్వాత న్యాయవిద్యను పూర్తిచేసి.. కోర్టులో లాయరుగా అడుగుపెట్టారు. తన వాక్పటిమతో.. అక్కడా విజయం సాధించారు. ఈ క్రమంలో.. ప్రముఖుల దృష్టిలో పడ్డారు. రాజకీయాల్లోకి ప్రవేశించి సెనేటర్‌గా ఎంపికయ్యారు. అప్పటికి ఆయన వయసు 29 మాత్రమే! బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు బైడెన్.
ప్రేమ-పెళ్లి..
బైడెన్ ది ప్రేమ వివాహం. ఆయన యుక్తవయసులో ఉండగా.. ఓ సారి బహమాస్ కు వెళ్లారు. అక్కడ సిరాక్యూస్ యూనివర్సిటీలో చదువుతున్న నీలియా హంటర్ పరిచయమయ్యారు. బైడెన్.. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డారు. 1966లో నీలియాను వివాహం చేసుకుని, 1968లో లా పాసయ్యారు. ఆ వెంటనే విల్మింగ్టన్ లో లాయర్ గా ప్రాక్టీసు మొదలెట్టారు. అప్పటికే ఆయన డెమొక్రాటిక్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు.
చిన్న వయసులోనే సెనేటర్.. అంతలోనే విషాదం
బైడెన్.. 1972లో డెలావర్‌కు సెనేటర్ గా ఎంపికయ్యారు. అతి చిన్నవయసులో సెనేటర్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే.. ఆయనకు షాక్ తగిలింది. కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆయన భార్య, ముగ్గురు పిల్లలు ప్రయాణిస్తున్న వాహనానికి యక్సిడెంట్ అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. భార్య, కూతురు మరణించగా.. ఇద్దరు పిల్లలు గాయాలతో బతికి బయటపడ్డారు. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలోనే సెనేటర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

పిల్లలకు అన్నీ తానై..
తల్లిలేని పిల్లలను బైడెన్.. ప్రాణంలా చూసుకున్నారు. పిల్లల కోసం విల్మింగ్టన్ లోనే ఎక్కువ సమయం గడిపేవారు. వాషింగ్టన్, విల్మింగ్టన్ మధ్య రోజూ రైలులో తిరిగేవారు.
రెండో పెళ్లి..!
1977.. రాజకీయాల్లో బైడెన్ తీరిక లేకుండా గడుపుతున్న సమయం. సరిగ్గా అప్పుడే.. జిల్ ట్రేసీ జాకబ్స్ అనే ఓ టీచర్.. ఆయనకు పరిచయమయ్యారు. అది కాస్తా.. ప్రేమకు, ఆతర్వాత పెళ్లికి దారితీసింది. వీరికి ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రథమ మహిళగా బైడెన్ పక్కన కనిపిస్తున్నది జాకబ్సే!
Also Read ;- కమలా హారిస్ ‘పర్పుల్’ డ్రస్ వెనక ఇంత కథ ఉందా!

సుదీర్ఘ రాజకీయ జీవితం
బైడెన్.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. 6 సార్లు సెనేటర్ గా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, అధ్యక్షుడు కావాలన్నది ఆయన చిరకాల కోరిక. ఆ కలను 78 ఏళ్ల వయసులో ఘనవిజయం సాధించి.. సాకారం చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అట్టడుగు స్థాయి నుంచి అగ్రాజ్యాధినేతగా ఆయన ఎదిగిన క్రమం.. అందరికీ ఆదర్శప్రాయం. తన టీమ్‌లో మహిళలకు, భారతీయులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఆయన.. భారతీయులకు మరింతగా మేలు చేయాలని ఆశిద్దాం!











