ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది. ఓ వైపు కూటమి ప్రభుత్వంను ఎదుర్కొంటూ..మరోవైపు పురపాలక ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నో ఏళ్లుగా మైనార్టీ ఓట్లే తమకు తిరుగులేని బలమని నమ్ముతూ వస్తున్న వైఎస్సార్సీపీకి, ఇప్పుడు ఏకంగా ఆ వర్గం ఓట్లను చీల్చేందుకు ఒవైసీ పక్కా వ్యూహంతో రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
సాధారణంగా ఏపీ రాజకీయాల్లో మజ్లిస్ పార్టీ ప్రభావం నామమాత్రమేనని అంతా భావిస్తుంటారు. కానీ, ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేసిన ఒవైసీ..అన్ని స్థానాల్లో కాకుండా ఎక్కడైతే పట్టు ఉందో, ఎక్కడైతే కచ్చితంగా గెలుస్తామో అక్కడే పోటీ చేయాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లారు. ఇందులో భాగంగానే వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న కడప కార్పొరేషన్ మేయర్ పీఠంపై మజ్లిస్ కన్నుపడింది. కడప మేయర్ పదవితో పాటు, విజయవాడ కార్పొరేషన్లో కీలకమైన డివిజన్లు, హిందూపురం మున్సిపాలిటీ ఛైర్పర్సన్ స్థానం అలాగే ఆదోని, రాయదుర్గం, నంద్యాల, పెనుగొండ వంటి ప్రాంతాల్లో మజ్లిస్ అభ్యర్ధులను బరిలోకి దించారు. ఏకంగా 21 స్థానాల్లో మజ్లిస్ పోటీ చేస్తుండటం వైసీపీ క్యాంప్‌లో గుబులు పుట్టిస్తోంది.
ఏపీ స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు స్వయంగా హైదరాబాద్ నుంచి మజ్లిస్ కీలక నేతలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మిరాజ్, మహ్మద్ ముబీన్, మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ రియాజ్ ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రాంతీయ పార్టీ అధినేతగా ఒవైసీ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు జగన్‌కు నిజంగానే BP తెప్పిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ, క్షేత్రస్థాయిలో పురపాలక పోరును సీరియస్‌గా తీసుకున్న జగన్‌కు ఈ పరిణామం శరాఘాతంగా మారింది. మైనార్టీలు ఎప్పుడూ తమ వెంటే ఉంటారనే ఓవర్ కాన్ఫిడెన్స్‌కు చెక్ పెడుతూ, మజ్లిస్ పార్టీ ముస్లిం ప్రాబల్యం ఉన్న స్థానాల్లో పాగా వేయాలని చూస్తుండటం వైసీపీకి మింగుడు పడటం లేదు. ముఖ్యంగా కడప గడ్డపైనే మజ్లిస్ మేయర్ బరిలో నిలవడం, ముస్లిం ఓట్లలో చీలిక వస్తే అది ప్రత్యర్థులకు ప్లస్ అవుతుందనే ఆందోళన జగన్‌ను కలవరపెడుతోంది. మొత్తానికి, ఏపీ స్థానిక పోరులో మజ్లిస్ ఎంట్రీ కేవలం కొన్ని స్థానాలకే పరిమితం కాకుండా, రాబోయే రాజకీయ సమీకరణాలపై పెద్ద ప్రభావమే చూపేలా కనిపిస్తోంది.











