YS ఫ్యామిలీకి దశాబ్దాల తరబడి విధేయుడిగా ఉంటూ, జగన్ అక్రమాస్తుల కేసుల్లో A-2గా జైలు శిక్ష సైతం అనుభవించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన లాయల్టీకి సరైన గుర్తింపు దక్కకపోగా, సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీతో పాటు వైసీపీ సోషల్ మీడియా తనపైనే మూకుమ్మడి దాడులకు దిగడం సాయిరెడ్డిని తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని రాజకీయ వర్గాల్లో బలమైన వాదన వినిపిస్తోంది.
ఇటీవల ఆయన విడుదల చేసిన లేఖలో అప్రూవర్ ప్రస్తావన తీసుకురావడం వెనుక భారీ వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో దర్యాప్తు సంస్థల ముందు అప్రూవర్‌గా మారే అవకాశం, ఒత్తిడి ఉన్నప్పటికీ కేవలం జగన్ పట్ల ఉన్న విధేయతతోనే ఆయన ఆ అవకాశాన్ని తిరస్కరించారు. కానీ, పార్టీలో తనకు జరుగుతున్న వరుస అవమానాలను చూశాక, తాను చేసిన త్యాగానికి ఏమాత్రం విలువ లేదన్న ఆవేదన విజయసాయిరెడ్డిలో బలంగా నాటుకుపోయింది.
జగన్ ఆర్థిక సామ్రాజ్యానికి, క్విడ్ ప్రో కో వ్యాపారాలకు ప్రధాన ఆడిటర్‌గా వ్యవహరించింది విజయసాయిరెడ్డే. షెల్ కంపెనీల ఏర్పాటు, నిధుల మళ్లింపు, విదేశీ పెట్టుబడుల లావాదేవీలకు సంబంధించిన అణువణువూ ఆయనకు తెలుసు. ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన అత్యంత కీలకమైన సాక్ష్యాలు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు ఇప్పటికీ ఆయన వద్దే భద్రంగా ఉన్నాయని, అవే ఇప్పుడు జగన్ మెడకు ఉరితాడుగా మారబోతున్నాయని సమాచారం.
త్వరలోనే ఆయన ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే యోచనలో ఉన్నారని, ఆ ప్రకటనకు ముందే ఓ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారని ఊహాగానాలు తీవ్రమయ్యాయి. అదే జరిగితే, అక్రమాస్తుల కేసుల వెనుక ఉన్న అసలు రహస్యాలన్నీ ఆధారాలతో సహా బట్టబయలు కావడం ఖాయం. ఒకప్పటి జగన్ అత్యంత ఆప్తుడే ఇప్పుడు దర్యాప్తు సంస్థల ముందు అప్రూవర్‌గా మారి తెరవెనుక ఆర్థిక లావాదేవీల చిట్టా విప్పితే, అది వైసీపీ అధినేతకు రాజకీయంగా, న్యాయపరంగా కోలుకోలేని పెను దెబ్బ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.











