ఏపీ స్థానిక ఎన్నికల వివాదంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికలను ఆపాలని, ఏకగ్రీవాలను రద్దు చేయాలని జగన్ సేన పడిన పాట్లకు సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయినట్లయింది. పోనీ.. కోర్టు సాక్షిగా సింపథీ కొట్టేద్దామనుకున్న వైసీపీ లాయర్ల నాటకాలను సుప్రీం ధర్మాసనం సున్నితంగా తిప్పికొట్టింది. పైగా నామినేషన్లు వేశారుగా..వెళ్లి పోటీ చేయండి, మీ అభ్యర్థులందరికీ మా తరఫున ఆల్ ది బెస్ట్ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో తమ వాళ్లను నామినేషన్లు వేయనీయలేదని, ఏకగ్రీవాలు ఆపేయాలని, పంజాబ్ తరహాలో హైకోర్టు రిటైర్డ్ జడ్జితో నిజనిర్ధారణ కమిషన్ వేయాలని వైసీపీ పెద్దలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏంటో సుప్రీంకోర్టు బలంగానే అంచనా వేసింది. విచారణ సందర్భంగా వైసీపీ సీనియర్ లాయర్ మణిందర్‌సింగ్ వాదనలు వినిపిస్తుండగా..జేబులో నుంచి తడవకో కాగితం తీసి, ఏదో రాజకీయ సభల్లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు అంటూ సీజేఐ ఆయనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైసీపీ తీరుకు అద్దం పట్టాయి. గాలివాటు ప్రకటనలతో కోర్టుల సమయం వృథా చేయొద్దని, లేని అభ్యర్థుల కోసం ఎన్నికలను ఆపలేమని తేల్చిచెప్పారు.
రాజకీయాల స్థాయిని దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు కోర్టులు వాటికి దూరంగా ఉంటాయని CJI స్పష్టం చేశారు. అసలు మీ అభ్యర్థులు ప్రస్తుతం ఎన్నికలు జరగాలనే కోరుకోవడం లేదని, మీ ఆ ఉచ్చులో తాము ఇరుక్కోబోమని జగన్ పార్టీకి గట్టిగానే మొట్టికాయలు వేశారు. ఎన్నికల సంఘం ఇప్పటికే గడువు పెంచి నామినేషన్లకు అవకాశం ఇస్తే.. మీ వాళ్ళు ఆల్రెడీ నామినేషన్లు వేశారని, ఇక వెళ్లి పోటీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
చివరికి వైసీపీ లాయర్లు డ్రామాలు చేసినా, క్షేత్రస్థాయిలో అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయిస్తోందని ఆరోపించినా ధర్మాసనం పట్టించుకోలేదు. మీకు ఏమైనా ఆధారాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని, లేదా ఎన్నికల పిటిషన్లు వేసుకోవాలని సూచించింది. చివరకు వైకాపా వాదనలతో విసిగిపోయిన సీజేఐ.కొన్ని విషయాలపై మీరు ప్రజావేదికలపైనే పోరాడాలి అంటూ చురకలంటించి విచారణ ముగించారు.
మొత్తానికి, ఎన్నికల ముందు రకరకాల డ్రామాలతో హైకోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి సుప్రీంకోర్టుకు ఎక్కిన వైసీపీ అధినేత జగన్‌కు.. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.











