మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ED స్పీడ్ పెంచింది. వివేకా హత్య వెనుక కుదిరిన రూ.40 కోట్ల డీల్, ఆ నిధుల మూలాల ఆధారంగా అధికారులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఇప్పటికే అప్రూవర్ దస్తగిరి (A-4), సునీల్ యాదవ్ (A-2) ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కీలక సమాచారం సేకరించిన ఈడీ.. తాజాగా A-1 ఎర్రగంగిరెడ్డి, A-3 ఉమాశంకర్‌రెడ్డిలను వరుసగా రెండు రోజుల పాటు దాదాపు 16 గంటల సుదీర్ఘ విచారణ జరిపి సంచలన విషయాలు రాబట్టింది.
2019 మార్చి 14 అర్ధరాత్రి హత్య జరిగిన తర్వాతి రోజు ఉదయం ఎర్రగంగిరెడ్డి ఇంట్లో జరిగిన రహస్య భేటీ, అందులో పాల్గొన్న వ్యక్తుల వివరాలపై ED అధికారులు ప్రధానంగా ఆరా తీశారు. హత్య అనంతరం ఉమాశంకర్‌రెడ్డి గోడ దూకి పారిపోతున్న సీసీటీవీ ఫుటేజీని, కాల్ డేటాను నిందితుల ముందుంచి ప్రశ్నించారు. దస్తగిరి ఇచ్చేందుకు ఒప్పుకున్న రూ.5 కోట్లలో అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.కోటి ఎవరి నుంచి వచ్చింది? సునీల్ యాదవ్ పంపిన రూ.75 లక్షల వెనుక అసలు హస్తం ఎవరిది? మిగతా రూ.40 కోట్ల నిధుల మూలాలు ఎక్కడున్నాయి? అనే కోణంలో ఆర్థిక లావాదేవీలను తవ్వి తీశారు.
ప్రారంభంలో నిందితులు ప్రశ్నలను దాటవేసేందుకు ప్రయత్నించినప్పటికీ..ED అధికారులు సేకరించిన డిజిటల్ ఆధారాలు, బ్యాంకింగ్ రికార్డులను ముందుంచడంతో గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి లొంగిపోక తప్పలేదు. హత్య కుట్ర నుంచి నిధుల పంపిణీ వరకు ఏయే దశల్లో ఎంతెంత నగదు చేతులు మారింది, ఈ దారుణంలోకి ఎవరెవరు ప్రవేశించారనే అంశాలపై పక్కా ఆధారాలతో అధికారుల బృందం వారి నుంచి కీలక రహస్యాలు సేకరించినట్లు సమాచారం.
ఈ ఇద్దరి విచారణ ద్వారా రాబట్టిన సంచలన సమాచారం ఆధారంగా ED తదుపరి బిగ్ యాక్షన్‌కు సిద్ధమవుతోంది. వివేకా హత్య కేసులో కీలక పాత్రదారులుగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి (A-7), ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి (A-8)లను అతి త్వరలోనే విచారణకు పిలిపించేందుకు అధికారులు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.











