‘బిగ్ బాస్’ రియాలిటీ షో మొదలైన దగ్గర నుంచి ప్రతి సీజన్ లోను హౌస్ లో ప్రేమ పక్షులు కనిపిస్తూనే వచ్చాయి. అలా ‘బిగ్ బాస్’ సీజన్ 4లోను ఒక ప్రేమజంట ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ఆ జంట పేరే అఖిల్ – మోనాల్. ‘బిగ్ బాస్ 4’ సీజన్ ఆరంభంలో అటు అభిజిత్ తోను .. ఇటు అఖిల్ తోను మోనాల్ చనువుగా వ్యవహరిస్తూ వచ్చింది. దాంతో మోనాల్ విషయంలో ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. ఎలాంటి ఆర్ ఆర్ లేకుండా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఏదో బాగుందే అని ప్రేక్షకులు ఫాలోఅవడం మొదలుపెట్టారు.
కానీ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఇంటర్వెల్ సమయానికే అభిజిత్ శుభం కార్డు వేసేశాడు. దాంతో చాలామంది డీలాపడిపోయారు. కానీ అఖిల్ ఏమైనా తక్కువ తిన్నాడా .. బలమైన ప్రేమకథను తన భుజం పై వేసుకుని హౌస్ అంతా తిప్పాడు. హౌస్ లోని ఏ కెమెరా ఏం షూట్ చేసినా, తమ అవుట్ పుట్ మాత్రమే బయటికి వచ్చేలా చేయగలిగాడు. దాంతో ఎలాంటి విలన్ అడ్డుపడకుండానే అఖిల్ – మోనాల్ జంట ప్రేమకథ సాఫీగా .. సక్సెస్ ఫుల్ గా సాగింది. హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా, ఏ గేమ్ షో చూసినా అఖిల్ – మోనాల్ కలిసే కనిపించారు.
గతంలో చాలామంది ప్రేమలో పడ్డారుకానీ, టైమ్ కలిసిరావడంతో ఈ ఇద్దరూ ప్రేమకు ప్రతినిధుల్లా మారిపోయారు. ఈ ఇద్దరితో సినిమా తీసినా ఆశ్చర్యం లేదని చాలామంది అనుకున్నారు .. చివరికి అదే జరిగింది. బుల్లితెరపై సాగిన ప్రేమకథ బుల్లితెరపైకి వచ్చేస్తోంది. ఈ ఇద్దరూ జంటగా ‘తెలుగు అబ్బాయి – గుజరాత్ అమ్మాయి’ పేరుతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్ ను వదిలారు. టైటిల్ కి తగినట్టుగా డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. సరస్వతీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సిరీస్ కు భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
Must Read ;- గోవాలో వర్మను కలిసిన బిగ్ బాస్ బ్యూటీ