అందం .. ఆనందం .. అల్లరి .. సంతోషం .. సంబరం .. ఊహ .. ఉత్సాహం .. ఇవన్నీ నిహారికకు పర్యాయపదాలుగా కనిపిస్తాయి. ఎప్పుడూ చూసినా నవ్వుతూ ఆమె మంచు తెరలను గుర్తుచేస్తూ ఉంటుంది.
చాలాకాలం క్రితమే నిహారిక బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలిసారిగా నిహారికను చూసినవాళ్లు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారు. అవకాశం ఉంది గనుక ఎంట్రీ ఇచ్చి ఉంటుందని అనుకున్నారు. అలా అనుకున్నవారు తమ అభిప్రాయం తప్పని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎంతో అనుభవం ఉన్న యాంకర్ లా ఆమె బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అలా తొలి ప్రయత్నంలోనే నిహారిక తన టాలెంట్ ను చాటుకుంది.
నిహారికకు ముందుచూపు కూడా ఎక్కువేనని చెప్పక తప్పదు. ఇప్పుడంటే ఇక్కడ అంతా వెబ్ సిరీస్ లంటూ పరిగెడుతున్నారుగానీ, తొలి రోజుల్లోనే నిహారిక వెబ్ సిరీస్ లు కూడా చేసేసింది. అప్పట్లోనే ఆమె ఆ వెబ్ సిరీస్ లకు నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. ‘ముద్దపప్పు ఆవకాయ్’ .. ‘నాన్నకూచి’ .. ‘మ్యాడ్ హౌస్’ వెబ్ సిరీస్ లు నటన పరంగా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ వెబ్ సిరీస్ ల కారణంగా యూత్ కి ఆమె మరింత చేరువైంది. ఒక వైపున వెబ్ సిరీస్ లలో నటిస్తూ .. మరో వైపున వాటి నిర్మాణ వ్యవహారాలను చూసుకుంటూ సినిమాలపై కూడా నిహారిక దృష్టి పెట్టింది.
‘ఒక మనసు’ సినిమా ద్వారా నిహారిక తెలుగు తెరకి పరిచయమైంది. నాగశౌర్య జోడీగా ఆమె ఈ సినిమాలో అలరించింది. మెగా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి హీరోయిన్ గా రావడం అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ అమ్మాయి పెద్ద సాహసమే చేసిందనుకుంటూనే థియేటర్స్ కి వెళ్లారు. ఆ సినిమాలో ‘సంధ్య’ పాత్రలో పద్ధతిగా కనిపిస్తూనే ఆమె ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ సినిమా ఫలితాన్ని గురించి అటుంచితే, లుక్ పరంగా .. నటన పరంగా నిహారిక అభిమానులను సంపాదించుకుంది.
ఈ సినిమా తరువాత నిహారికకు అవకాశాలు చాలానే వచ్చాయి. అయినా వాటిలో తనకి నచ్చిన కథలను .. పాత్రలను మాత్రమే ఆమె చేసింది. తన హుందాతనాన్ని కాపాడుకుంటూనే ‘హ్యాపీ వెడ్డింగ్’ .. ‘సూర్యకాంతం’ సినిమాల్లోను నటించి యూత్ ను మరింతగా ఆకట్టుకుంది. భారీ చారిత్రక చిత్రమైన ‘సైరా నరసింహారెడ్డి‘లోను ఒక చిన్న పాత్రలో మెరిసి, పెదనాన్నతో కలిసి తెరపై కనిపించాలనే తన ముచ్చట తీర్చుకుంది. ఇలా నిహారిక ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఇటీవలే చైతన్యతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజున ఆమె పుట్టినరోజు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకి ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
నిహారిక బర్త్ డే పార్టీ వేడుక
జొన్నలగడ్డ నిహారిక పుట్టిన రోజు పార్టీ ఎక్కడో తెలుసా?.. ఈరోజు రాత్రికి ఫలక్ నామా ప్యాలెస్ లో ఆమె పుట్టిన రోజు పార్టీ ఘనంగా ఏర్పాటుచేసినట్టు తెలిసింది. ఇప్పటికే నవదంపతులు చైతన్య, నిహారిక జంట ఈ ప్యాలెస్ లో ఉన్నట్టు సమాచారం. చైత్యన్య బంధువులు, మెగా కుటుంబం అంతా ఈ పుట్టిన రోజు వేడుకలో పాలుపంచుకోనున్నట్లు తెలిసింది. ఈ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కానున్నాయి. అన్నట్టు నిహారిక తండ్రి నాగబాబు కూడా తన ‘అదిరింది’ సహచరులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. మొత్తానికి ఈ నాగబాబు కుటుంబానికి సంబధించినంత వరకూ ఇదే పెద్ద పండుగ అని చెప్పాల్సిందే.
Must Read ;- ఈ సారి సుధీర్ జోడీగా రష్మీ చేయడం ఖాయమట!