తెలుగు తెరపై కథానాయికలు కనువిందు చేసే కాలపరిమితి చాలా తక్కువని అంటారు. కానీ అందులో నిజం లేదని అనుష్క .. నయనతార .. శ్రియ .. కాజల్ .. త్రిష నిరూపించారు. వీళ్లందరూ కూడా సుదీర్ఘ కాలంగా తమ కెరియర్ ను కొనసాగిస్తున్నారు. కొత్తగా ఎంతమంది కథానాయికలు తెరపైకి వచ్చినా, ఎలాంటి జంకూ లేకుండా ముందుకు దూసుకెళుతూనే ఉన్నారు. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను తమకి ఢోకా లేదనే విషయాన్ని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. కొత్త ప్రయోగాలతో కొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉన్నారు. అలాంటి కథానాయికల జాబితాలో కనిపించే మరో అందమైన పేరే ‘తమన్నా‘.
తమన్నా 2005వ సంవత్సరంలో ‘శ్రీ’ అనే సినిమాలో మంచు మనోజ్ జోడీగా తెలుగు తెరకి పరిచయమైంది. ‘దశరథ్’ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తన కెరియర్ ను ఆరంభించిన ఆమె ‘హ్యాపీడేస్‘ సినిమాతో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత నుంచి ఆమె తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఒకానొక దశలో తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఈ రెండు భాషల్లోను అటు సీనియర్ స్టార్ హీరోలతోను .. యువ కథానాయకులతోను నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వెళ్లిన తమన్నా, ఆ తరువాత నటనకి ప్రాముఖ్యతనిస్తూ మనసులు దోచుకుంది. టాలీవుడ్లో డాన్స్ ల విషయంలో తిరుగులేని హీరోలుగా చలామణి అవుతున్న ఎన్టీఆర్ .. అల్లు అర్జున్ .. చరణ్ .. రామ్ వంటి హీరోలతో పోటీపడి డాన్స్ చేసే నాయికగా తమన్నా ప్రశంసలు అందుకుంది. సుందరమైన .. సుకుమారమైన ప్రేమ కథానాయికగానే కాదు, వీరోచితమైన పాత్రల్లో సైతం మెప్పించగలనని ఆమె నిరూపించుకుంది. ‘బాహుబలి’ .. ‘సైరా’ సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలుగా కనిపిస్తాయి.
తమన్నాను తొలిసారిగా తెరపై చూసిన ప్రేక్షకులు గంధంతో చేసిన బొమ్మనా? గాలివాటుకు కొట్టుకొచ్చిన గంధర్వ కన్యనా? అనుకున్నారు. నింగి నుంచి జారిపడిన జాబిలమ్మనా? తళుక్కున మెరిసే మెరుపుతీగకు రూపం వచ్చిందా? అనే అయోమయానికి లోనయ్యారు. ఇప్పటికీ ఇటు టాలీవుడ్లోను .. అటు కోలీవుడ్లోను గ్లామర్ కు పర్యాయపదంగా తమన్నా పేరే చెబుతారు. అందుకే తమ సినిమాకి మరింత గ్లామర్ అద్దాలని భావించేవారు ఆమె ఐటమ్ సాంగ్ పెడతారు .. అందుకోసం ఆమెకి భారీ పారితోషికం ముట్టజెబుతారు.
ఒక చిన్న సినిమాతో తమన్నా ప్రయాణం మొదలైంది. చిత్రపరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టినా, ఆ తరువాత ఆమె అడుగుల్లో ఎక్కడా తడబాటు కనిపించదు. తన కెరియర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. వివిధ జోనర్లలో నటించి మెప్పించింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరి సరసన సినిమాలను చుట్టబెట్టేసింది. ఒక్క గ్లామర్ ని మాత్రమే నమ్ముకుని వచ్చి ఉంటే, తమన్నా ఎప్ప్పుడో కనుమరుగయ్యేది. నటన విషయంలో ఆమెకు వంకబెట్టవలసిన అవసరం లేదు గనుకనే ఇంకా ఆమె జోరు కొనసాగుతోంది .. పున్నమి వెన్నెల్లా ఆమె క్రేజ్ వెలుగుతోంది.
ఇతర భాషల నుంచి కొత్త కథానాయికల పోటీ ఎక్కువవుతున్నా, తమన్నా తట్టుకుని నిలబడుతోంది. అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఒక భారీ హిట్ కొట్టేసి మళ్లీ పుంజుకుంటోంది. ఇప్పటికీ కూడా ఆమె చేతిలో తెలుగు .. తమిళ .. హిందీ సినిమాలు ఉన్నాయి. ఆ లిస్ట్ ను బట్టి చూస్తే వచ్చే ఏడాదిలో కూడా ఆమె దూకుడుకి ఎలాంటి బ్రేక్ లేదనే చెప్పాలి. ఇకపై నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు ఎక్కువగా చేయాలనే ఉత్సాహంతో ఆమె ఉంది. ఆ దిశగా కొన్ని కథలు వింటోందని అంటున్నారు. అందం .. అభినయం .. అదృష్టం పుష్కలంగా ఉన్న తమన్నాకి, ఇప్పట్లో అవకాశాలకేం కొదవలేనట్టే. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తోంది.
— పెద్దింటి గోపీకృష్ణ
Must Read ;- సామ్ జామ్ లో ఫ్యాషన్ దుస్తులతో ప్రేక్షకులను కట్టిపడేసిన తమన్నా.. !