తెలుగు సినిమా రంగంతో ఆయనది ‘అల్లు’కున్న బంధం.
వెండి వెలుగులతో ‘ఆహా’ అనిపించిన పయనం.
ఆయన సినీ గవాక్షాన్ని తెరిస్తే కనిపించేది హిట్లతో విరిసిన అరవింద దళాక్షం.
అందుకే ఆ ‘అల్లు’ వైకుంఠపురములో కొలువుదీరాలనేది ఎందరికో కల.. అక్కడికి చేరుకోవడం ఓ పెద్ద కళ.. ఆ కల ఓ అలగా మొదలై కెరటంగా మారి ‘అల్లు’కోవడం మామూలు వ్యవహారం కాదు. సినిమా రంగంలో మూడు తరాల బంధం, 71 ఏళ్ల అనుబంధం.. వెరసి అల్లు అరవింద్ అనే రూపం. తెలుగులో అఅ… ఇంగ్లీషులో ఏఏ… ఈ రెండు భాషలకూ అదే కదా మొదలు. అందుకేనేమో ఈ అక్షర రాత ఆయన ‘గీత’ను కూడా మార్చేసింది. గీతా ఆర్ట్స్ కు అంకురార్పణ చేసింది.
చివరికి అది ఏఏ అనే బ్రాండ్ నేమ్ కు వేదికైంది. సినిమా రంగాన్ని ‘అల్లు’వైకుంఠపురముగా తీర్చిదిద్దింది. ఈ కథ ఇక్కడ మొదలైంది కాదు… దాని ‘పుట్టిల్లు’ పాలకొల్లు… రంగస్థలంలో మొదలైన హాస్యపు జల్లును అల్లు రామలింగయ్యగా సినిమా రంగానికి తీసుకొచ్చి ‘వద్దంటే డబ్బు’ వచ్చేలా చేసింది. ఆ పద్మశ్రీ అల్లు రామలింగయ్య వేసిన బీజం ఈ రోజు ఆ సినిమా రంగంలో అల్లు అరవింద్ రూపంలో శాఖోపశాఖలుగా విస్తరించి ‘ఆహా’ అనిపిస్తోంది. ఈ మజిలీ ఇంకెక్కడ ఆగుతుందో.
అల్లు ‘గీత’ గోవిందం ఇలా..
‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని’ అంటాడు ఆచార్య ఆత్రేయ. 1949 జనవరి 10న పుట్టిన అరవింద్ కు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఒక్కటే… ‘నాన్నలా నటన బాటలోకి వెళ్లాలి’ అని. చుట్టూ సినిమా వాతావరణం.. తెల్లారి లేస్తే స్టూడియోలు.. వాటి చుట్టూ రౌండప్ లూ.. మనసు మరో వైపు ఎందుకుచూస్తుంది. తండ్రి అల్లు రామలింగయ్య ఏర్పాటుచేసిన గీతా ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ 1974లోనే ‘బంట్రోతు భార్య’ అనే సినిమా తీసింది. అప్పటికే అరవింద్ కు నూనూగు మీసాల నూతన యవ్వనం.
మనసులో సినిమా కల అలాగే ఉంది. ఈలోగా జీవితంలో మరో మలుపు సోదరి సురేఖకు అప్పుడప్పుడే ఎదుగుతున్న కొణిదెల చిరంజీవితో వివాహం. ఇది ఓ ‘మెగా’ మలుపు అవుతుందని కూడా ఆనాడు అరవింద్ ఊహించి ఉండరు. 1984లో ‘హీరో’ కల నటుడిని మాత్రమే చేసింది. అదే ఏడాది ‘మహానగరంలో మాయగాడు’గా మిగిలిన ఈ ‘చంటబ్బాయి’ నట దాహం ఈ రోజు పుత్రుల రూపంలో తీరుతోంది. ఆయన ‘గీత’ మాత్రం ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది.
మనసు పాద రసం.. మాటలో చాణక్యం
ఆయన అరవింద దళాక్షుడు. కలువ రేకుల్లాంటి కళ్లు లేకపోయినా ఆ చూపుతోనే దేన్నయినా ఇట్టే పసిగట్టేస్తారు. మనసు పాదరసంలా పనిచేస్తుంటుంది. మాటలో చాణక్యం కనిపిస్తుంది. ఈ సినీ గవాక్షం నుంచి ఎన్నో విజయకేతనాలను ఎగరేయడానికి ఇదే కారణం కావచ్చు. ఆయన జడ్జిమెంటు తప్పిన దాఖలాలు తక్కువ. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ‘గీతా’సంస్థకు ఆయనే పెట్టని కోట.
ఇన్ని హిట్లు ఉంటే ఆయనకు ‘ప్రతిరోజూ పండగే’ కదా. ఆయన రక్తంలో ఉన్న నట దాహం కూడా ఎక్కడికీ పోలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూపంలో ‘మైకేల్ జాక్సన్ కే మతిపోయే’లా చేస్తోంది. అలాంటి పుత్రోత్సాహం ఉంటే ఆ ‘అరవింద’ దళం విచ్చుకోకుండా ఎలా ఉంటుంది. ఆ ‘పుష్ఫ’ విలాసం హిట్లు అనే పరిమళాలతో విరాజిల్లుతూనే ఉంటుంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘లియో న్యూస్’ శుభాకాంక్షలు అందజేస్తోంది.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- ఆచార్యకు నో చెప్పి.. అల్లు అర్జున్ కి ఓకే చెప్పిందా.?