పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు సాధించిన బీజేపీకి ఆ తర్వాత తెలంగాణలో పెద్దగా విజయాలు దక్కలేదు. ఎంపీటీసీ, సర్పంచి , మునిసిపాలిటీ, సింగల్ విండో… ఇలా ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేక చతికల పడింది. అయితే ప్రస్తుతం బీజేపీ ఆ స్థితిలో లేదు. చాపకింద నీరులా గ్రేటర్ లో తన బలాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగినవి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. గ్రేటర్ లో పట్టు సాధిస్తే రాష్ట్ర మంతా పట్టు దక్కినట్టే అని భావించేంత ఎన్నికలు ఇవి. అందుకే అన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతుంటాయి. ఓల్డ్ సిటీలో ఎం.ఐ.ఎం కంచుకోటగా మార్చుకోగా మిగిలిన ప్రాంతాల్లో పట్టుకోసం అన్ని పార్టీలు సాయశక్తులా కృషి చేస్తుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీనే గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పదవి కైవసం చేసుకునే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే గత గ్రేటర్ ఎన్నికల కంటే ముందు హైదరాబాద్ లో టీఆర్ ఎస్ పెద్దగా సీట్లు గెలిచిన దాఖాలు లేవు. అంతకు ముందు జరిగిన సాధారణ ఎన్నికల్లో నూ టీఆర్ఎస్ నగరం ఎమ్మెల్యే సీట్లను కూడా గెలవ లేక పోయింది. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల్లో ఏకంగా వంద సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది
రెండోసారి హుషారా…ఉసూరా..?
టీఆర్ఎస్ రెండోసారి పగ్గాలు చేపట్టాక జరగబోతున్న ఎన్నికల్లో ఆ పార్టీకి అన్ని సీట్లు వస్తాయా లేదా అన్న చర్చ మొదలయింది. కేటీఆర్ 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని, వారు పనితీరు మెరుగు పరచుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇదే అదనుగా భావించిన బీజేపీ తెలంగాణలో పట్టు బిగించాలని, గ్రేటర్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. బండి సంజయ్ అద్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎదుర్కోబోతున్న మొదటి పెద్ద ఎన్నికలు కావడంతో బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో ఏ చిన్న సంఘటన జరిగినా టీఆర్ఎస్ .. ఎంఐఎంలను ఒకే గాటన కట్టి విమర్శల వర్షం కురిపిస్తోంది. ఎంఐఎంను టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ ఓ వర్గం ఓట్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతూ ప్రజల చూపు తమ వైపు తిప్పుకునుందకు శతవిధాలా ప్రయత్నిస్తోంది చేసుకుంటోంది బీజేపీ.
ప్రజాసమస్యలపై అలుపెరగని పోరు…
బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు పార్టీకి ప్లస్ పాయింట్ అవుతున్నాయంటున్నారు నిపుణులు. గతంతో పోల్చితే గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ కార్యకలాపాలు పెరగడంతోపాటు ప్రజా సమస్యపై పార్టీ పోరుబాట పడుతుండటం బలంగా మారుతున్నాయంటున్నారు. ఎంఐఎం ను బండి సంజయ్ గట్టిగానే టార్గెట్ చేస్తుండటం.. క్షేత్ర స్థాయి కార్యకర్తలు సైతం ఆయనకు తగ్గట్టుగా దూకుడుగా ప్రజల్లోకి వెళ్తుండటంతో పార్టీ బలం పెరుగుతున్నట్టే అంటున్నారు విశ్లేషకులు. గత గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 5 సీట్లకే పరిమితం అయిన బీజేపీ ఈ సారి కనీసం 15 నుంచి 20 సీట్లయినా తన ఖాతాలో వేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇంకొంచెం కష్టపడితే అనుకున్న ఫలితాలు రాబట్టుకోగలదంటున్నారు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తే… పార్టీకి గ్రేటర్ లో మంచి రోజులు వచ్చినట్టే అంటున్నారు రాజకీయ నిపుణులు