దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. హోరాహోరి పోరులో బీజేపీ విజయదుందుంభి మోగించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 1470 ఓట్లతో విజయం సాధించారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబురాలను జరుపుకుంటున్నారు. మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా విజయం ఇద్దరి మధ్య కాసేపు దోబూచులాడింది. చివరి నిమిషంలో బిజెపి గెలిచింది. మొదటి 5 రౌండ్లు వరకు బీజేపీ ఆధిక్యంను కొనసాగిస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్నిరౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యతను సాధిస్తే, ఆ తరువాత మళ్లీ చివరి 5 రౌండ్లలో మాత్రం బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని కనబరిచి విజయాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 23 రౌండ్లకు కౌంటింగ్ జరిగింది. ఇందులో 62772 ఓట్లతో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, 61302 ఓట్లతో టీఆర్ఎస్ రెండస్థానానికి పరిమితమైంది.అలాగే కాంగ్రెస్ పార్టీ 21819 ఓట్లతో మూడవ స్థానంతో సరిపెట్టుకుంది.
రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠ…
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది. ముందు నుంచి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా తలపడ్డాయి. రౌండ్ రౌండ్‌కు మధ్య టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొదటి 5 రౌండ్లు బీజేపీ ఆధిక్యం కనబరచగా 6, 7, 10 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. ఆ తరువాత 12వ రౌండ్లో ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీ 83 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తరువాత 15వ రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ బీజేపీని వెనక్కు నెట్టేసి ముందుకు సాగింది. ఆ తరువాత చివరగా సాగిన 20, 21, 22 రౌండ్లలో కారును బీజేపీ వెనక్కి నెట్టేసి భారీ ఆధిక్యతను సాధించి విజయదుందుంభి మోగించింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. బీజేపీ చీఫ్ బండి సజయ్, మాజీ ఎంపీ వివేక్, మరికొంత మంది నాయకులు.. రఘునందన్‌రావు గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. 1470 ఓట్లతో మెజారిటీతో టీఆర్ఎస్పై బేజేపీ విజయం సాధించింది.