దుబ్బాక గెలుపు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. జీహెచ్ఎంసీలోనూ ఆ జోరు కొనసాగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌తో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లపై కమలం కన్నేసింది. బండి సంజయ్ దూకుడు చూస్తే అక్కడా సత్తా చాటడం ఖాయమేనేమో అనిపిస్తోంది! కమలం వరుస విజయాలతో టీఆర్ఎస్ సైతం సందిగ్ధంలో పడింది. ఇప్పుడు అడ్డుకట్ట వేయలేకపోతే ఆ పార్టీని ఇక కట్టడి చేయడం కష్టమే అనే భావనకు వచ్చేసింది. అందుకే.. ఉద్యమ పార్టీ పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. బీజేపీ మాత్రం తన స్టాటజీతో దూసుకెళుతోంది.
ఖమ్మానిది ఓ లెక్క…
ఖమ్మం రాజకీయ సమీకరణాలను అంచనా వేయడం అసాధ్యం. తెలంగాణ వ్యాప్తంగా ఓ లెక్కుంటే అక్కడ మరో లెక్క ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఓ ఫలితాలు వస్తే అక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా రిజల్ట్స్ ఉంటాయి. అటువంటి ఖమ్మంలో కాషాయ జెండా ఎగుర వేయాలని భాజపా తహతహలాడుతోంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌లో జోష్ మీదున్న బీజేపీను దెబ్బతీయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించడం.. ప్రభుత్వంపై ఆసక్తికర కామెంట్స్ చేయడంతో ఖమ్మం మరోసారి చర్చల్లోకి ఎక్కింది.
స్తంభాద్రిలో బీజేపీ పరిస్థితేంటి?
కమ్యూనిస్టులకు కంచుకోటైన ఖమ్మంలో బీజేపీ ఓటు బ్యాంకు ఆశించిన స్థాయిలో లేదు. పక్కాగా చెప్పాలంటే.. ఖమ్మంలో బీజేపీకి ప్రత్యేకించి ఓటు బ్యాంకే లేదు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ఉప్పల శారదకు పదివేల పైచిలుకు ఓట్లు మాత్రమే రాగా గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. అయితే, అక్కడి టీఆర్ఎస్‌లోని అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీకి గణనీయంగా పెరిగిన గ్రాఫ్ అన్నీ చూస్తే ఈసారి ఖమ్మంలో కమలం తమదైన ముద్రవేయడం ఖాయమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Must Read ;- తిరుపతిలో బైబిల్‌కు, భగవద్గీతకు మధ్యే పోటీ: బండి సంజయ్
మేమున్నామనే భరోసా కల్పిస్తూ…
ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గింది. కాంగ్రెస్‌ను ఆదుకునే నేత లేక విలవిల్లాడుతోంది. ఈ తరుణంలో అక్కడి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఆ రెండు పార్టీలు విఫలమైన ప్రతిచోటా మేమున్నామని భరోసానిస్తోంది. సమస్య ఏదైనా యుద్ధ ప్రాతిపదికన అక్కడ వాలిపోతోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటోంది. ప్రజలతో మమేకమై చురుకుగా ఉన్న యువతను తమ వైపు తిప్పుకుంటోంది. ఎల్‌ఆర్‌ఎస్, వంద రోజులకు పైగా రిజిస్ట్రేషన్లు నిలుపుదల, సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర విషయంలో బీజేపీ తన పంథాలో దూకుడుగా స్పందించింది. ఎప్పటికప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలతో ప్రజల మధ్యనే ఉంటున్న భావనను కల్పించగలిగింది.
గోళ్లపాడుతో ప్రజల్లోకి…
ఖమ్మంలోని గోళ్లపాడు నిర్వాసితులకు అండగా నిలవడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. ఆ విషయంలో బీజేపీ వేగంగా స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడడంలో సఫలీకృతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎంఎల్ పార్టీలు తేరుకుని గోళ్లపాడు నిర్వాసితుల సమస్యను ఓన్ చేసుకునేలోగా వారికి సత్వర న్యాయం చేయడానికి జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి నేరుగా పర్యటించారు. బాధితులతో మాట్లాడడం.. బాధ్యులైన ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసి మరీ ఢిల్లీ పిలిపించి చీవాట్లు పెట్టడం ఆ పార్టీ క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి. అంతిమంగా మంత్రి అజయ్‌కుమార్ చొరవ చూపినప్పటికీ… అప్పటికే ఈ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది.
అభివృద్ధి పనులతో అజయ్ దూకుడు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే అజయ్‌కుమార్. తన పట్టును నిలుపుకుని.. జిల్లా హెడ్‌క్వార్టర్ నుంచి తొలిసారిగా మంత్రి హోదాను సాధించగలిగారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఆయనకు సవాల్ లాంటివే. దీని కోసమే నిర్విరామంగా శ్రమిస్తున్న మంత్రి అజయ్ ప్రతిపక్షాలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. నగరంలో దశాబ్దాల నాటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. రోడ్ల వెడల్పు.. సెంట్రల్ లైటింగ్.. పలు బ్రిడ్జిల నిర్మాణం.. పార్కుల ఆధునీకీకరణ.. కూడళ్ల నిర్మాణం.. లాంటి వాటితో మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తిచేస్తూ ముందుకెళ్తున్నారు. అదే సమయంలో అన్ని వర్గాలతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఏ వర్గం దగ్గరవుతుందో.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని తీసుకుంటుందోనన్నది వేచి చూడాల్సిందే!
రాజకీయ దురందరిడిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం… అనతి కాలంలో ప్రజలకు చేరువైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరంగా ఉండడం.. వంటివి బీజేపీకు అనుకూలించే అంశాలు. అయితే, మంత్రి అజయ్ ఆలోటు లేకుండా చూడగలరా? వరుస విజయాలతో దూసుకొస్తున్న బీజేపీకు అడ్డుకట్ట వేయగలరా? వేచి చూడాల్సిందే!!
Must Read ;- అరువుకు పొరుగు రాష్ట్రం నాయకుడు.. తిరుపతిలో ‘బండి’ దూకుడు