నోముల నర్సింహయ్య చనిపోయారనే వార్త రాగానే.. కొంతమంది అయ్యో అనుకున్నారు. మరి కొంతమంది అరెరె అన్నారు. చాలామంది మాత్రం వెంటనే అన్న మాట ఒకటే ‘‘అబ్బో మరో ఉప ఎన్నిక వచ్చేసిందా. దుబ్బాక అయిపోయింది.. గ్రేటర్ అయిపోయింది.. ఇప్పుడిక నాగార్జునసాగరా‘‘. ఇదే ఆలోచన చాలామంది మదిలో మెదిలింది. వ్యూహాలు రచించి.. అమలు చేయడంలో ఆరితేరిన బీజేపీ అటు నర్సింహయ్య అంత్యక్రియలు కూడా కాక ముందే రాజకీయం మొదలెట్టేసింది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిని దువ్వడం మొదలెట్టింది. ఆయన కొడుకు రఘువీర్‌కి టిక్కెట్ ఆఫర్ చేసేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు నిస్సహాయంగా చూస్తుంటే.. టీఆర్ఎస్ మాత్రం ఉలిక్కిపడింది.
కోరినవి ఇస్తే జానారెడ్డి రెడీ..
జానారెడ్డి ఎప్పటి నుంచో కాంగ్రెస్‌పై అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనే తనకు బదులు కొడుకు రఘువీర్‌కి టిక్కెట్ ఇచ్చి.. తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని అడిగారు. కాని అవలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్ధితి అసలే బాగోలేదు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ తనకు వ్యతిరేకం.. నల్గొండ జిల్లాలో వారిదే బలమెక్కువ. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కాస్తో కూస్తో ఉన్నా ఏమీ చేయలేడు. పాత మిత్రుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి టీర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. దీంతో కమలరథం ఎక్కడమే బెటరని జానారెడ్డి ఆల్‌రెడీ డిసైడ్ అయిపోయారని చెప్పుకుంటున్నారు.
జానారెడ్డి తనకు గవర్నర్ పోస్టు కావాలని బీజేపీని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కుమారుడు రఘువీర్‌కి సాగర్ టిక్కెట్ ఇవ్వాలనేది ప్రథమ డిమాండ్. ఈ రెండూ కన్‌ఫామ్ చేస్తేనే తాను బీజేపీలో చేరతానని షరతు పెట్టారంట. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆ మేరకు హామీ ఇచ్చి పెద్దలతో మాట్లాడి చెబుతానన్నారంట. అయితే జానారెడ్డి మాత్రం తనకు అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేయాలని.. ఆ హామీ అమిత్ షాతోనే చెప్పించాలని కోరారట. లేదంటే మాత్రం చేరేది లేదని ఖండితంగా చెప్పేశారంట. విజయశాంతి సైతం జేపీ నడ్డాతోనే శాలువా కప్పించాలన్నట్లే.. జానారెడ్డి మూడడుగులు ముందుకేసి అమిత్ షాతో మీటింగ్ అడిగారు.
Must Read ;- స్ట్రాటజీ : ఆమె ద్వారానే అందరికీ గేలం వేస్తున్నారు!
గులాబీ శిబిరంలో గుబులు
జానారెడ్డి కోరికలపై బీజేపీ ఏం చేస్తుందో గాని.. ఇటు గులాబీ శిబిరంలో మాత్రం గుబులు మొదలైంది. ఇప్పటికే దుబ్బాకతో షాక్ తిని.. గ్రేటర్‌తో తలబొప్పి కట్టిందిరా బాబూ అనుకుంటుంటే.. ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక వచ్చేస్తోంది. కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండిరా నాయనా.. ఉప ఎన్నికలొస్తే మా వల్లకాదు అంటున్నట్లుగా సోషల్ మీడియాలో జోకులు తిరుగుతున్నాయి.
నల్గొండ జిల్లాలో పాగాకు బీజేపీ ప్లాన్
డిఫెన్సులో పడినందుకే.. కేసీఆర్ నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు ప్రత్యేకంగా హాజరయ్యానే టాక్ కూడా ఉంది. ఇక సాగర్‌లో నోముల కుటుంబానికి టిక్కెట్ ఇవ్వాలా.. లేక దుబ్బాక అనుభవంతో సమర్ధుడైనవారికి ఇవ్వాలా అనే దాంట్లో కూడా గులాబీదళం మీమాంసలో పడింది. ఇటు బీజేపీ మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో జానారెడ్డిని చేర్చుకుని.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని.. దుబ్బాక, గ్రేటర్‌లతో వచ్చిన ఊపు కొనసాగించాలనే ప్లాన్‌లో ఉంది. పైగా సాగర్ కనుక గెలిస్తే.. నల్గొండ జిల్లాలో కూడా క్రమంగా బలపడొచ్చనే ప్లాన్ కూడా వినపడుతోంది. రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది. అదే జరిగితే ఇక నల్గొండ జిల్లాలో కమలం తొడ గొట్టడం ఖాయమే. అప్పుడు సాగర్ మరో దుబ్బాక అయ్యే అవకాశం ఉంది.
Also Read ;- బీజేపీలో చేరక ముందే ఎంజాయ్ చేస్తున్న మాజీ ఎంపీ?