BJP Leader Bhanuprakash Reddy Sensational Comments On AP Police :
కరోనా వ్యాప్తిని కారణంగా చూపి ఏపీలో వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రత్యేకించి బీజేపీ నేతృత్వంలో ఏపీలో సోమవారం పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా జగన్ సర్కారు నిర్ణయాన్ని తూర్పారబడుతూ బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు కూడా ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. బీజేపీ నిరసనలకు తోడు విశ్వ హిందూ పరిషత్ కూడా నిరసనలను చేపట్టింది. మొత్తంగా ఇప్పుడు ఏపీలో బీజేపీ.. దాని అనుబంధ సంఘాలు, వీహెచ్‌పీ తదితర సంఘాలు కొనసాగిస్తున్న నిరసనలతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. నిరసనలకు దిగిన బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్ట్‌లపైనా బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
కేసులు ఏ సెక్షన్ల ఆధారంగా..?
బీజేపీకి చెందిన కీలక నేత, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి మాజీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి.. నిరసనకు దిగుతున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అసలు రాజ్యాంగం అమలు అవుతుందా? అంటూ ప్రశ్నించిన ఆయన.. ఏపీ పోలీసులు వైసీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా కేసులు పెడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నోట నుంచి ఓ బాంబు లాంటి కామెంట్ వినిపించింది. ఏపీలో పోలీసులు ఐపీసీ సెక్షన్ల ఆధారంగా కేసులు పెడుతున్నారా?. లేదంటే వైసీపీ సెక్షన్ల (వైసీపీ నేతలు ఆదేశించినట్లుగా) ఆధారంగా కేసులు పెడుతున్నారా? అంటూ తనదైన శైలి కామెంట్ చేశారు. ఏపీ పోలీసుల తీరు చూస్తుంటే.. వారు ఎప్పుడో ఐపీసీ సెక్షన్లను పక్కనపెట్టేసి.. కొత్తగా వైసీపీ సెక్షన్లను ఫాలో అవుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో కనీసం నిరసనలు చేపట్టే హక్కు కూడా పార్టీలకు గానీ, సంస్థలకు గానీ, వ్యక్తులకు గానీ లేదన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భాను మాటలు వాస్తవమేగా
వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేసిన జగన్ సర్కారు తీరుపై నిరసనలకు దిగిన తమ పార్టీ నేతలనుయ అరెస్ట్ చేయడమేమిటన్న ఆగ్రహంతో భానుప్రకాశ్ రెడ్డి ఆ మాటలన్నా.. వైసీపీ హయాంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఆయన మాటలు నిజమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నామధ్య కొండపల్లి పరిసరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న అనుమానంతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలన కోసం వెళితే.. ఆయనపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తనపై దాడి చేసిన వారిపై దేవినేని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. నిందితులే ఓ ఫిర్యాదు ఇచ్చారంటూ దేవినేనిపైనే ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, జైలుకూ తరలించారు కదా. ఇప్పుడు భానుప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో దేవినేని ఉమాపై పోలీసులు పెట్టిన కేసును గుర్తు చేసుకుంటున్న జనం.. ఏపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ల ఆధారంగానే కేసులు పెడుతున్నారన్న వ్యాఖ్యలు చేస్తున్నారు.
Must Read ;- లోకేశ్ దెబ్బకు జగన్ దిగిరావాల్సిందే











