దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ నవంబర్ 3వ తేదీన జరగనుంది. గడువు సమీపిస్తుండటంతో ఎన్నికల అభ్యర్థుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచార నేపథ్యంలో నువ్వెంత అంటే నువ్వెంతా అనుకునే స్థాయికి ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతివిమర్శలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కరీంనగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మంత్రి హరీష్‌రావుపై మండిపడ్డారు. బూట్ పాలిష్ నాయకుల సవాళ్లకు తాను స్పందించనని బండి తెలిపారు.
అసలు ఆ సవాళ్లు ఏమిటీ..
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్-హరీష్ రావు మధ్య మొదటి నుంచి మాటల తూటాలు పేలుతునే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం దుబ్బాక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు బండి సంజయ్‌ను ఉద్ధేశిస్తూ ఇలా విమర్శించారు. బీడి కార్మీకులకు ఇచ్చే పెన్షన్ రూ.1600లలో ఒక పైసా కూడా బీజేపీ ఇవ్వడంలేదు. తమ ప్రభుత్వమే ఇస్తుందన్నారు. కానీ బీజేపీ మాత్రం తాము కూడా ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తుందని బండి సంజయ్‌పై ఆయన మండిపడ్డారు.
అయితే ఈ విషయంలో బండి సంజయ్ కు హరీష్ రావు ఇలా సవాల్ విసిరారు. పెన్షన్ విషయంలో చర్చించేందుకు బండి సంజయ్ సిద్ధిపేట్ పాత బస్టాండ్ కు రావాలని, ఎవరు చెప్పేదీ నిజమో అక్కడే ప్రజల మధ్య తేల్చుకుందామన్నారు. ఎవరిది తప్పని తేలితే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఇలాంటివే మరికొన్ని అంశాలపైన బండి సంజయ్‌కి మంత్రి సవాల్ విసిరి చర్చలకు రమ్మంటే బండి సంజయ్ రావడంలేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఇదే స్థాయిలో బండి సంజయ్ కూడా మంత్రి హరీష్‌కు ప్రతి సవాల్ విసురుతూ ప్రత్యారోపణలు చేశారు. అయితే తాజాగా హరీష్ రావు సవాళ్లపై స్పందించిన బండి.. బూటుపాలిష్ నాయకుల సవాళ్లకి తాను స్పందించనని హరీష్‌నే ఉద్ధేశించి అన్నట్లుగా తెలుస్తోంది.
ప్రగతి భవన్ వద్ద కూర్చుంటా…
దుబ్బాకలో బీజేపీకి ఓటేసి గెలిపిస్తే మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను తీసుకుని వెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్ ముందు కూర్చుంటానని దుబ్బాక ఎన్నికల ప్రచార కార్యక్రమం నేపథ్యంలో బండి సంజయ్ తాజాగా మాట్లాడారు. బీజేపీపై టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ ఫలితమే దుబ్బాకలో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు త్యాగం చేసే వాళ్లు బీజేపీ నాయకులేనన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అప్పుడు హరీష్‌రావు పెట్రోల్ పోసుకున్నాడు గానీ, తనకు అగ్గిపెట్టే దొరకలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతచారి అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడేనని తెలిపారు. ఫించన్ల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రేషన్ బియ్యంలో బీజేపీ రూ.29 ఇస్తుందని, అలాగే రూ.1500 కోట్లతో రెండు లక్షల ఇళ్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దుబ్బాక వైపు రాష్ట్రమంతా చూస్తుందని, బీజేపీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆయన కోరారు. మీటర్లను టీఆర్ఎస్ నాయకులకు పెడతామని ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడి సీపీని చూసి పోలీస్ అమరుల ఆత్మ క్షోభిస్తుందని ఆరోపించారు.
బండి సంజయ్ చేసిన విమర్శలపై మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.