దర్శకుడు రాజమౌళికి భాజపా ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చేశారు. ఆర్.ఆర్.ఆర్. మూవీలో భీమ్ పాత్ర ధరించిన టకియాను (ముస్లింలు ధరించే టోపీ) తొలగించాలని ఆదేశించారు. అలా కాదని సినిమా విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమని ఆయన అన్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడైన సంగతి తెలిసిందే.
అయితే భీమ్‌ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని ఆయన అభిప్రాయ పడ్డారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలన్నారు. లేకుంటే మర్యాద ఉండదని హెచ్చిరించారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో భీమ్ పాత్రను పరిచయం చేస్తూ ఈ నెల 22వ తేదీ కొమరం భీమ్ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేశారు. అందులో భీమ్ టకియాను ధరించడం అనేది వివాదాస్పదంగా మారింది. వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాలని పలు ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ మనోభావాలను దెబ్బ తీస్తే ఊరుకోబోమని ఆ సంఘాలు హెచ్చిరస్తున్నాయి.











