బాలీవుడ్ తెరను ఎంతోమంది కథానాయకులు పరిపాలించారు .. అభిమానుల హృదయాల్లో జైత్రయాత్రలు చేశారు.ఆణిముత్యాల్లాంటి కథలతో .. పగడాల్లాంటి పాటలతో .. రత్నాల్లాంటి పాత్రలతో బాలీవుడ్ బాంఢాగారాన్ని నింపేశారు. అలాంటి కథానాయకులలో ‘రాజేశ్ ఖన్నా’ ఒకరు. బాలీవుడ్ సినిమాలను గురించి ఓ గ్రంథం రాస్తే అందులో కొన్ని పేజీలు రాజేశ్ ఖన్నా గురించి ఉంటాయి .. ఆయన పాటలపై ఒక పుస్తకం రాస్తే గనుక, అందులో మరిన్ని పేజీలే ఉంటాయి.అందుకు కారణం తన పాత్రల విషయంలో .. తన పాటల విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ.
రాజేశ్ ఖన్నా పేరు వినగానే ఆయనలోని రొమాంటిక్ హీరో కళ్లముందు కదలాడతాడు. కళ్లు చిట్లిస్తూ .. కథానాయిక కళ్లలోకి తీక్షణంగా చూస్తూ ఆయన పండించే రొమాన్స్ ను ఆనాటి ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడేవారు. ఇక ఆయన రొమాన్స్ కి మంచి పాట .. మల్లెపూల వాన తోడైందంటే ఆయన ఎక్స్ ప్రెషన్స్ మరోస్థాయికి వెళ్లేవి. అందువల్లనే అప్పట్లో ఆయన సినిమాల్లో సాధ్యమైనంతవరకూ ‘వానపాట’ పెట్టడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపేవారు. అలా అప్పట్లో హీరోయిన్ తో కలిసి ఆయన తడిసిన పాటలు వింటుంటే, ఇప్పటికీ బయట ముసురుపడినట్టుగానే అనిపిస్తుంది.
రాజేశ్ ఖన్నా అసలుపేరు ‘జతిన్ ఖన్నా’ .. స్కూల్ స్థాయిలోనే ఆయన నాటకాల పట్ల ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. వయసుతో పాటు నటనపట్ల ఇష్టం పెరుగుతూ వెళ్లింది. దాంతో ఆయన సినిమాల దిశగా అడుగులు వేశారు. అలా సినిమాల కోసం తన పేరును రాజేశ్ ఖన్నాగా మార్చుకున్న ఆయన, ‘ఆఖరీ రాత్’ తో బాలీవుడ్ తెరకి పరిచయమయ్యారు. 1966లో విడుదలైన ఆ సినిమాతో నటనపరంగా ఆయన మంచి మార్కులు దక్కించుకున్నారు. రెండవ సినిమా అయిన ‘రాజ్’లో ఆయన ద్విపాత్రాభినయం చేయడం విశేషం. మొదటి సినిమాతోనే తనపై ఇండస్ట్రీకి ఆయన కలిగించిన నమ్మకం అలాంటిది.
కెరియర్ తొలినాళ్లలోనే ‘ఆరాధన’తో ఆయన భారతీయ సినిమా ప్రేక్షకులందరినీ తనవైపుకు తిప్పుకున్నారు. రాజేశ్ ఖన్నా తన పాత్రలో ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారతీయ తొలి సూపర్ స్టార్ గా ఆయన గురించి అంతా చెప్పుకున్నారు. ఆ వెంటనే ‘ఇత్తెఫాక్’ .. ‘దో రాస్తే’ .. ‘డోలి’ సినిమాలు కథానాయకుడిగా ఆయన పునాదులను మరింత బలోపేతం చేశాయి. ఇక 70 దశకం తనదేనని రాజేశ్ ఖన్నా నిరూపించాడు. ఈ దశకంలో ఆయన చేసిన ‘కటీ పతంగ్’ .. ‘సచ్ఛా ఝూట్’ ..’అమర్ ప్రేమ్’ .. ‘హాథీ మేరే సాథీ’ .. ‘ ఆనంద్’ ..’బావార్చి’ .. ‘అజ్నాబీ’ చిత్రాలు ఆయన కెరియర్లో మైలురాళ్లుగా నిలిచాయి.
రాజేశ్ ఖన్నా చేసిన సినిమాలు .. పాత్రలు ఆయనను తిరుగులేని రొమాంటిక్ హీరోగా నిలబెట్టాయి. హీరోయిన్ కళ్లలోని భావాలను చదువుతూ .. తన చూపుల్లోని అర్థాలను ఆమె మనసు వాకిట్లో వెదజల్లే ఎక్స్ ప్రెషన్స్ తో ఆయన మహిళా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఆయన షూటింగు ఫలానా చోటున జరుగుతుందని తెలిస్తే అక్కడికి టీనేజ్ అమ్మాయిలు పెద్ద సంఖ్యలో వచ్చేవారట. ఇక ఇటు తను బస చేసిన హోటల్ నుంచి .. అటు ఇంటి నుంచి ఆయన బయటికి వచ్చే పరిస్థితి లేనంతగా అమ్మాయిలు గుమిగూడేవారని అంటారు. కొంతమంది అమ్మాయిలు ఆయన కారుపై పడిన దుమ్మును నుదుటున ‘బొట్టు’గా పెట్టుకునేవారంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
రాజేశ్ ఖన్నా సినిమాలకి పాటలు ప్రాణంగా నిలిచేవి .. తన పాటలను ఆయన ఎక్కువగా కిషోర్ కుమార్ తోనే పాడించేవారు. తన వాయిస్ కి దగ్గరగా ఉంటుందని ఆయన కిషోర్ కుమార్ ను ప్రోత్సహించారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వెలువడ్డాయి .. ఇప్పటికీ అవి రాజేశ్ ఖన్నా వైభవానికి అర్థం చెబుతూనే ఉంటాయి. ముంతాజ్ .. హేమమాలిని .. షర్మిళా ఠాగూర్ .. ఆశా పరేఖ్ .. షబానా ఆజ్మీ .. ఇలా ఎంతోమంది ఆయన సరసన నాయికలుగా అలరించారు. ముంతాజ్ తో ఆయన ఎక్కువ సినిమాలు చేయడం విశేషం.
కొత్త తరం నుంచి పోటీ ఎదురవుతున్నా, తనకి గల క్రేజ్ తో 80వ దశకంలోను ఆయన తన జోరును కొనసాగించారు. కథ నేపథ్యాన్ని బట్టి కొన్ని మల్టీ స్టారర్ చిత్రాల్లోను నటించారు. ఆ తరువాత తన వయసుకు తగిన .. తన స్థాయికి తగిన పాత్రలను చేస్తూ వచ్చారు. ఎప్పుడూ కూడా ఆయన తన స్థాయికి తగని పాత్రలు చేయలేదు. అలాంటి పాత్రలను చేయమని అడిగే సాహసం కూడా దర్శక నిర్మాతలు చేయలేదు. రాజేశ్ ఖన్నా తన కెరియర్లో విభిన్నమైన పాత్రలు చేసినా, తొలినాళ్లలో చేసిన రొమాంటిక్ కథలను అభిమానులు తమ మనోఫలకం పై నుంచి చెరపలేకపోయారు. ప్రేమకథల ప్రతినిధిగానే ఆయనను ఆరాధిస్తూ వచ్చారు.
కథానాయకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగాను రాజేశ్ ఖన్నా కొన్ని సినిమాలను నిర్మించారు. అంతేకాదు .. దర్శక నిర్మాతలు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని రిక్వెస్ట్ చేస్తే కొన్ని పాటలు కూడా పాడారు. ఇక రాజకీయాల్లోను ఆయన చురుకుగా వ్యవహరించారు. కథానాయకుడిగా సుదీర్ఘమైన ప్రయాణం .. సాధించిన విజయాలు .. మరిచిపోలేని పాత్రలు .. కళాకారుడిగా అందించిన సేవలు ఆయనకి ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తెచ్చిపెట్టాయి. కథానాయకుడిగా తన ప్రతి కదలిక ప్రత్యేకమేనని నిరూపించుకున్న రాజేశ్ ఖన్నా, బాలీవుడ్ బంగారమేనని చెప్పుకోవాలి. ఈ రోజున ఆయన జన్మదినం .. ఈ సందర్భంగా ఆయనను ‘ది లియో న్యూస్’ స్మరించుకుంటోంది.
— పెద్దింటి గోపీకృష్ణ
Must Read ;- అసమానం .. అజరామరం దిలీప్ కుమార్ ( 11వ తేదీ .. జన్మదిన ప్రత్యేకం)