యుద్ధాన్ని చూడటానికి ఎవరూ ఇష్టపడరు .. కానీ ఆ యుద్ధం ప్రేమకోసం జరుగుతున్నప్పుడు చూడకుండా ఉండలేరు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ మాత్రమే పండుతుంది .. గల్లాపెట్టె నిండుతుంది అనేది అనేక సినిమాలు నిరూపించాయి. అలాంటి యాక్షన్ ను .. ఎమోషన్ ను కలుపుకుని ఒక భారీ బడ్జెట్ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే ‘సూర్యవన్షి’. అక్షయ్ కుమార్ – కత్రినా కైఫ్ జంటగా రోహిత్ శెట్టి ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా నిర్మాణంలో ఆయన కూడా ఒక భాగస్వామి కావడం విశేషం.
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ సినిమాలో, రణ్ వీర్ సింగ్ .. అజయ్ దేవగణ్ .. జాకీ ష్రాఫ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇలా భారీ తాగణంతో రూపొందిన ఈ సినిమా కోసం అక్షయ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా క్రితం ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వెనక్కి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు 100 పెర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చనేది షురూ అయిన తరువాత థియేటర్లకు వస్తున్న పెద్ద సినిమా ఇదే.
లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే వత్తిడి పెరిగినప్పటికీ, అక్షయ్ కుమార్ మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారట. సినిమా విడుదల విషయంలో జరిగిన జాప్యం వలన సహజంగానే కొంత నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఈ సినిమా థియేటర్లకు వచ్చిన నెలలోపు ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘మాస్టర్’ సినిమా కూడా ముందుగా థియేటర్లో రిలీజ్ చేసి, ఆ తరువాత 16 రోజులకు ఓటీటీలో వదిలారు. ఈ రెండు చోట్ల కూడా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మరి అలా ‘సూర్యవన్షి’ కూడా దూసుకుపోతుందో లేదో చూడాలి.