తలైవి చిత్రం చిత్రీకరణ మళ్లీ హైదరాబాద్ లో జరగనుంది. ఇందుకోసం ప్రధాన పాత్రధారి, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ఆమె తెలియజేశారు. కథ తనచుట్టూ తిరిగే ప్రధాన పాత్రలను పోషించడంలో కంగనారనౌత్ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తలైవి పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది.
ఇందులో జయలలిత పాత్రను ఆమె పోషిస్తుండగా.. ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలలో ప్రకాష్ రాజ్, పూర్ణ తదితరులు కనిపించనున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే ఓ షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరిపారు. ఇందులో భాగంగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వాటిలో కంగన కూడా పాల్గొన్నారు. అయితే ఆ షెడ్యూల్ ముగియగానే తన సోదరుడి వివాహానికి వెళ్లిన కంగన అక్కడ కుటుంబ, బంధుమిత్రులతో కలిసి ఆనంద క్షణాలను గడిపింది.
తిరిగి తలైవి చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుండటంతో ఎంచక్కా ప్రయాణానికి సిద్ధమైంది. ప్రస్తుతం హిమాలయాల వద్ద ఉన్న మనాలి నుంచి తాను బయలుదేరబోతున్నానని తెలియజేస్తూ..వాస్తవానికి హిమాలయ పర్వతాలను విడిచిపెట్టి వెళుతుండటం బాధాకరంగా అనిపిస్తుంది. కష్ట సమయంలో ఈ ప్రాంతం నన్ను అక్కున చేర్చుకొని ఆనందాన్ని ఇచ్చింది. నేను అంతగా ఈ ప్రాంతంతో మమేకం కావడానికి అదే కారణం అని చెప్పుకొచ్చింది. ఇక తాను ఈ చిత్రంతో పాటు అంగీకరించిన ఇతర చిత్రాల షూటింగులలో పాల్గొనాల్సి ఉండటంతో హిమాలయాలకు తిరిగి రావడానికి చాలా రోజులు పట్టవచ్చునని కంగన తన పోస్టులో పేర్కొన్నారు.
Must Read ;- కంగనా రనౌత్ చేజారిన పీసీ శ్రీరామ్ తో సినిమా