మనసు పలికే మధురమైన మంత్రం ప్రేమ .. ఉత్సాహంతో ఊహలు కోరుకునే స్వతంత్రం ప్రేమ. వయసంటూ వచ్చాక అది హృదయపు తలుపులను తడుతూనే ఉంటుంది .. తరగని తలపుల తంత్రులను మీటుతూనే ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరిపై ఎలా కలుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి ప్రేమనేది పుట్టాక దానిని నియంత్రించడం .. నిరోధించడం చాలా కష్టం. ప్రేమకి ఎవరూ అతీతులు కారు. సాధారణమైనవారి నుంచి సెలబ్రిటీల వరకూ ఏదో ఒక సందర్భంలో దాని బారిన పడుతూనే వుంటారు. అయితే సినిమా వాళ్ల జీవితాల్లోకి బయటివారు తొంగిచూసే అవకాశం ఎక్కువ గనుక, వాళ్లు ప్రేమలో పడితే అదో పెద్ద వార్త అవుతుంది .. హాట్ టాపిక్ గా మారిపోయి హల్ చల్ చేస్తుంది. ఆమిర్ ఖాన్ కూతురు ప్రేమ వ్యవహారం విషయంలో కూడా ఇప్పుడు అలాగే జరిగింది.
బాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఆమిర్ ఖాన్ స్థానం ప్రత్యేకం. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రెస్ గా ఎదిగారు. ఆయన కూతురు ‘ఐరా ఖాన్’ ఆ మధ్య ‘మిషాల్’తో ప్రేమలో పడిందనే విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి జోరుగా షికార్లు చేస్తున్నారనే వార్త అప్పట్లో ప్రముఖంగా వినిపించింది. ‘ఐరా ఖాన్’ తన ప్రేమ విషయానికి తనే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి, సోషల్ మీడియా ద్వారా కావాల్సినంత ప్రచారం చేసుకుంది. బాలీవుడ్లో ఇలా ప్రేమలో పడటం .. అలా విడిపోవడం మాములేగా అని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే వీళ్ల ప్రేమ వ్యవహారం మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కారణమేమిటనే విషయాన్ని అలా ఉంచితే, క్రితం ఏడాదే ఇద్దరూ విడిపోయారు. అలా ‘మిషాల్’ నుంచి విడిపోయిన ‘ఐరా ఖాన్’ .. ఇటీవలే ‘నుపూర్ షీఖరే’తో ప్రేమలో పడింది.
నుపూర్ షీఖరే మంచి ఫిట్ నెస్ ట్రైనర్. చాలాకాలంగా ఆయన ఆమిర్ ఖాన్ కి ఫిట్ నెస్ ట్రైనర్ గా వ్యవహరిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ‘ఐరా ఖాన్’కి కూడా ఆయన ఫిట్ నెస్ విషయంలో శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే నుపూర్ ను ఐరా ఖాన్ దగ్గరగా చూడటం .. ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం జరిగిపోయిందట. తమ అభిరుచులు .. అభిప్రాయాలు కలవడంతో ఈ జంట ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారనే టాక్ కూడా బాలీవుడ్లో గుప్పుమంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రేమవ్యవహారాన్ని గురించి ‘ఐరా ఖాన్’ తన తల్లికి చెప్పినట్టుగా తెలుస్తోంది. కూతురు ప్రేమకి తల్లి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనీ, దాంతో ఆమె స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్ లో పార్టీ కూడా చేసుకుందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రేమికుల ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Must Read ;- తనపై వస్తోన్న డేటింగ్ వార్తల్ని ఖండించిన ఇస్మార్ట్ బ్యూటీ











