అందరూ పాన్ ఇండియా మూవీలు చేస్తుంటే అక్కినేని నాగార్జున ఎందుకు ఊరుకుంటారు. తాను కూడా ఓ పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పేశారు. చెప్పడమే కాదు ఆ సినిమాలో తన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేశారు. హిందీ, తెలుగు, కన్నడ, మళయాలం, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. దాని పేరు ‘బ్రహ్మాస్త్ర’. ఈ అస్త్రం చాలా పవర్ ఫుల్ . మరి నాగ్ పాత్ర అంత పవర్ ఫుల్ గా ఉంటుందో లేదో చూడాలి. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. నాగార్జునకి సంబంధించిన షూటింగ్ ముగిసినట్లుగా ‘బ్రహ్మస్త్ర’ టీమ్ ఇటీవలే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఇదే విషయాన్ని నాగార్జున కూడా తన ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి అతి భారీ బడ్జెట్ చిత్రంలో నటించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఓ సాధారణ ప్రేక్షకుడి మాదిరిగా తాను కూడా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నానని నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ఓ భారీ సెట్ లో నడుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Must Read ;- పోలీస్ ఆఫీసర్ పాత్రలో అక్కినేని హీరో











