ఒక వైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు విందుభోజనం కూడా ఆరగించేశారు. ఎటుచూసినా పెళ్లి హడావుడి కనిపిస్తోంది. అంతా సందడి, గోలగోలగా ఉంది. మధ్యలో ఒక కొత్త గోల మొదలైంది. ఒక గంట సేపు వెయిట్ చేయి.. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా.. అంటూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుక్కి ఓ కండిషన్ పెట్టింది. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా మట్టకండిలో జరిగిన ఈ ఘటనలో.. ఆ కండిషన్ ఇంతకూ ఎందుకు అనుకున్నారు?
పెళ్లి కూతురుకు ప్రేమవ్యవహారం ఉంది. కానీ.. ఆమె పెళ్లి జరుగుతున్నది ఆమె ప్రియుడితో మాత్రం కాదు. ఇంట్లో పెద్దలకు ఆమె ప్రేమ సంగతి తెలుసో లేదో మొత్తానికి పెళ్లి పీటల దాకా వచ్చింది.
ఆకులోకి వచ్చిన నోట్లోకి వెళ్లే లోగా ఏమైనా జరిగిపోవచ్చునని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది కూడా అంతే. పీటల మీదకు వచ్చినంత మాత్రాన పెళ్లి జరిగిపోయినట్టు కాదు కదా. అప్పుడు తన అమ్ముల పొదిలోంచి అసలు ట్విస్టును బయటకు తీసింది వధువు.
తాళి కట్టే వేళ- ఈపెళ్లి తనకు ఇష్టం లేదంటూ వధువు ప్రియదర్శిని మొండికేసింది. ఓ గంట పాటు ఆగాలని, తాను ప్రేమించిన యువకుడు రాకుంటే పెళ్లి చేసుకుంటానని వధువు తెగేసి చెప్పేసింది. అంటే ఏమిటన్న మాట.. పెళ్లి జరుగుతున్న సంగతిని తన ప్రియుడికి చేరవేసింది. అతగాడేదో.. పెళ్లి సమయానికి నేను వచ్చి.. తీసుకువెళ్తాన్లే మనం పెళ్లి చేసుకుందాం అని హామీ ఇచ్చినట్టున్నాడు. ఆ రకంగా ఇద్దరూ కలిసి సినిమా రేంజిలో ఈ ట్విస్టులను ప్లాన్ చేసినట్టున్నారు. తాళికట్టే సమయానికి ప్రియుడు రాకపోయేసరికి ఈ అమ్మడికి అతడి మీద అనుమానం రాలేదు. రాకపోగా.. ఓ గంట వెయిట్ చేద్దాం అని మొగుడు కావాలనుకుంటున్నవాడికి కండిషన్ పెట్టింది.
అంటే.. ప్రియుడు వస్తే ప్రియుణ్నే చేసుకుంటుంది. ప్రియుడు రాకపోతే గనుక.. ఎవడైనా పర్లేదు లెమ్మని.. వరుణ్ని చేసుకుంటుందన్నమాట. కూతురు ఇలా పెళ్లిని రసాభాసగా మార్చేసే సరికి, ఆమెకు మాటలతో నచ్చెప్పే ప్రయత్నం చేసి, వినకపోయేసరికి వధువును మందలించి, చేయి చేసుకునేందుకు ఆమె కుటుంబీకులు ప్రయత్నం చేశారు.
పాపం.. ఈ ప్రేమ వ్యవహారాలు.. ట్విస్టులు అర్థంకాని వరుడు ఆనంద్ బిత్తరపోయాడు. అతగాడికి పెళ్లికూతురు ఇచ్చిన ట్విస్టు కంటె.. పెద్ద ట్విస్టు ఏంటంటే.. వధువు ప్రేమించిన యువకుడు అక్కడకు రానేలేదు. అతడు రాకపోవడంతో పెళ్లి ఆగిపోయింది.
ఈ సంబంధం మాకు అక్కర్లేదని వరుడి తరఫు వారు లేచి వెళ్లిపోతే.. పరువు తీసిందనే బాధతో వధువు తరఫు వారు కూడా వెళ్లిపోయారు.
ఇరు కుటుంబీకులు వధువును వదిలి వెళ్లిపోయారు. అలా ఆ పెళ్లికూతురు పీటలపై మిగిలిపోయింది! ప్రియుడు మాత్రం రాలేదు.










