కర్నూలు జిల్లా పెసరవాయిలో చోటుచేసుకున్న టీడీపీ నేతల హత్యోదంతం నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పార్టీ కార్యకర్తలను వైసీపీ నేతలు దారుణంగా హతమార్చిన వైనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని లోకేశ్ ఒకింత ఆగ్రహంతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శిబిరం ఎదురు దాడికి దిగింది. నోరు తెరిస్తే… బూతులు మాట్లాడే మంత్రి కొడాలి నానిని రంగంలోకి దించిన వైసీపీ… చంద్రబాబు, లోకేశ్ లపై ఘాటు వ్యాఖ్యలు చేయించింది.
లోకేశ్ ఆగ్రహంలో తప్పేముంది?
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ కూడా తనదైన శైలిలో కౌంటర్లు సంధించింది. లోకేశ్ అంతు చూస్తామంటూ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ యువ నేత బీటెక్ రవి ఓ రేంజిలో స్పందించారు. శాసన మండలిలో లోకేశ్ వెంట్రుక కూడా పీకలేరంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలే చేసిన బీటెక్… టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పారు. అయినా పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను కోల్పోయిన నేపథ్యంలో లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, హత్యలను ప్రోత్సహిస్తున్నట్లుగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరగడంలో తప్పేముందని బీటెక్ రవి ప్రశ్నించారు. పార్టీ నేతలను పోగొట్టుకున్న బాధలో సీఎంను నిలదీస్తే… అంతు చూస్తామని స్వయంగా మంత్రులే ప్రకటనలు చేస్తుంటే… ఇక వైసీపీ కేడర్ ఏ రీతిన రెచ్చిపోవాలని ఆయన ప్రశ్నించారు. అయినా వైసీపీ దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకునేందుకు టీడీపీ ఏమీ చేతకాని పార్టీ కాదని ఆయన ఘాటుగా ప్రతిస్పందించారు.
లోకేశ్ ను ఏమీ చేయలేరు
ఈ మేరకు ఆదివారం కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీకి గట్టి వార్నింగే ఇచ్చారు. ‘టీడీపీ నాయకుల భాష ఏనాడూ హద్దులు దాటదు. పరిమితంగా మాట్లాడుతారు. మా నేతల భాష చాలా బాగుంటుంది. ఆగ్రహావేశాలకు లోనైనప్పుడు నోరు జారడం సహజమే. నారా లోకేష్ పాణ్యం నియోజకవర్గం పర్యటన సందర్భంగా కూడా ఇదే జరిగింది. దాన్ని తప్పు పట్టడం సహేతుకం కాదు. జంట హత్యలు చోటు చేసుకున్న చోట సహజంగానే ఉద్రిక్తత ఉంటుంది. అంతమాత్రాన పార్టీ నాయకులందరి భాషను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ను ఏకవచనంతో ఒక్కసారి సంబోధించగానే.. ఆయనను తప్పు పడుతూ కొడాలి నాని మాట్లాడిన పద్ధతి, తీరు బాగా లేదు. శాసన మండలిలో నారా లోకేష్ అంతు చూస్తామని హెచ్చరించడం సరికాదు. శాసన మండలిలో నా లాంటి సభ్యులు ఇంకా 14 మంది ఉన్నారు. మేము ఉండగా కొడాలి నాని గానీ ఇంకెవరైనా అధికార పార్టీ నేతలు గానీ నారా లోకేష్ వెంట్రుక కూడా పీకలేరు’ అని బీటెక్ రవి తనదైన శైలిలో స్పందించారు.
Must Read ;- పేలుడులో జగన్ కుట్ర కోణం… బీటెక్ రవి బద్దలు కొట్టేశారు!