రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ సినిమానే బబుల్ గమ్. యూత్ టార్గెట్ గా దర్శకుడు రవికాంత్ పేరేపు
బబుల్ గమ్ సాగుతుంది కదా అని సినిమాని కూడా సాగదీయాలని అనుకున్నట్టుంది. ఇంతకుముందు క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల డైరెక్ట్ చేసిన రవికాంత్ ఈసారి నేటితరం ప్రేమకథను ఎంచుకుని ఈ ప్రయోగం చేశాడు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది సాగలాగిన ఓ ప్రేమకథ. డీజే టిల్లు, అర్జున్ రెడ్డి కలగలిపి వండినట్టుగా అనిపిస్తుంది. ఆది(రోషన్ కనకాల) ఓ మధ్య తరగతి కుర్రాడు. డీజే అవ్వాలనేది అతని కల. అలా ఓ పబ్ లో అతని కోరికను తీర్చుకుంటాడు. అక్కడి వచ్చిన జాను(మానసా చౌదరి)ను చూసి ప్రేమలో పడతాడు. అబ్బాయిలను ఓ టాయ్ లా చూసే మనస్తత్వం ఆమెది. పైగా ఆమె డబ్బున్న కుటుంబంలోనిది. ఓ టాయ్ లాగేనే ఆదికి దగ్గరైనా అది సిన్సియర్ ప్రేమగా మారుతుంది. అతని బట్టటు కొంటుంది, తన క్రెడిట్ కార్డు ఇస్తుంది. కారు కూడా ఇస్తుంది. కానీ అతను మరో అమ్మాయిని ముద్దుపెట్టుకోవడం చూసి చివరికి అన్నీ లాగేసుకుని అతన్ని వీధిన పడేస్తుంది. ప్రేమలో పరాభవం ఎదురైన ఆదికి జీవితం మీద కసి పెరుగుతుంది. అది తన కెరీర్ మీద ఫోకస్ పెట్టేలా మారుతుంది. వీరిద్దరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగి ఎలా ముగిసిందన్నదే అసలు కథ. సాధారణంగా బబుల్ గమ్ నములుతుంటే ఎంత తియ్యగా ఉంటుందో నమిలే కొద్దీ అది సాగుతుంటుంది. చివరికి ఆ తీపి పోయి గమ్ మాత్రమే మిగులుతుంది. పూర్తిగా చప్పగా మారగానే దాన్ని ఊసి పడేస్తాం. అది ఎవడి చెప్పుకో, బూటుకో అంటుకుని చిరాకు తెప్పిస్తుంది. ప్రేమ కూడా ఈ బబుల్ గమ్ లాంటిదేనని దర్శకుడు ఈ కథకు ఈ పేరు పెట్టినట్టున్నాడు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఆదిగా రోషన్ కనకాల నటన అనేది తన రక్తంలోనే ఉందని తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు. డ్యాన్స్ లో ఈజ్, నటనలో వేరియేషన్స్ చూపడంలో నైపుణ్యం లాంటివి తొలి సినిమాలోనే కనిపించాయి. నూటికి నూరు శాతం తన పాత్రకు న్యాయం చేశాడు. కచ్చితంగా హీరోగా నిలబడతాడన్న నమ్మకాన్ని ఈ సినిమా ఇచ్చింది. ఇక జాను పాత్ర పోషించిన మానసా చౌదరి విషయానికి వస్తే రొమాంటిక్ సన్నివేశాల్లోనూ, భావోద్వేగాలను పండించడంలోనూ ప్రతిభను చాటుకుంది. నేటి యూత్ కు కనెక్ట్ అయ్యే పాత్రగానే చెప్పొచ్చు. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ప్రేమ అంటే ఇంతకంటే వేరే చెప్పేదేమీ ఉండదు కూడా. ముఖ్యంగా ఈ సినిమాలో చైతు జొన్నల గడ్డ పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. అతనిలోని టైమింగ్ ఆకట్టుకుంటుంది. తెలుగు సినిమాకు మరో మంచి తండ్రి దొరికాడని అనుకోవచ్చు. సంగీత పరంగా ప్లస్ లు మైనస్ లు చాలా ఉన్నాయి. పాటలు ఆకట్టకున్నాయి. బీజీఎం కొన్ని సందర్భాల్లో మెప్పించినా మరి కొన్ని సందర్భాల్లో చిరాకు తెప్పించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో డైలాగులు వినిపించకుండా మ్యూజిక్ అడ్డం పడింది. దాంతో కథలో క్లారిటీ మిస్సయిన భావన కలిగింది. సినిమా ముగింపు అసంపూర్తిగా అనిపిస్తుంది. దర్శకుడు కూడా కథను నడపడంలో తడబాటు కనిపించింది. కథనం ఓ ప్లోలో సాగలేదు. పడుతూ లేస్తూ ముందుకు సాగింది. ప్రేమికుల గమ్యం గందరగోళానికి దారితీసింది. షికార్లు.. రొమాన్స్‌లు.. లిప్ లాక్ లు లాంటి వాటితో కథ నడిపేద్దామని దర్శకుడు డిసైడ్ అయినట్టుంది. హీరోయిన్ తల్లిదండ్రులుగా హర్షవర్ధన్, అనుహాసన్ లివింగ్ రిలేషన్ పాతికేళ్ల తర్వాత పెళ్లిగా మారడం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. శ్రీచరణ్ పాకాల రీరికార్డింగ్ బాగున్నా కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టింది. దానివల్లే కథలో క్లారిటీ మిస్సయింది. రీరికార్డింగ్ లో ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. టార్గెట్ ఆడియన్స్ యూత్ కాబట్టి దర్శకుడి లక్ష్యం నెరవేరినట్టే. సుమ, రాజీవ్ కనకాల పుత్రోత్సాహం కూడా నెరవేరినట్టే.
నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి
సాంకేతికవర్గం: సంగీతం: శ్రీచరణ్ పాకాల, కమెరా: సురేష్ రగుతు; కథ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని; దర్శకత్వం: రవికాంత్ పేరేపు; నిర్మాణం: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
విడుదల తేదీ: 29-12-2023
ఒక్క మాటలో: సాగలాగిన బబుల్ గమ్ లాంటి ప్రేమ
రేటింగ్: 2.75/5
– హేమసుందర్ పామర్తి