(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
చారిత్రక నిర్మాణాలను కాపాడుకోవలసిన ప్రభుత్వాలు వాటిపైనే కన్నేస్తే…తప్పులు సరిదిద్దాల్సిన ప్రభుత్వాలే తప్పుడు దారిలో పయనిస్తే…ప్రస్తుతం విశాఖలో ఇదే జరుగుతోంది. తొట్లకొండపై 15ఎకరాలు సినిమా క్లబ్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై బౌద్ధ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ మేరకు అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. గతంలోనూ ఇక్కడ బౌద్ధ ఆరామాల పరిరక్షణకు ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు పోరాటం చేశారు.
3,300 ఎకరాలు ప్రొటెక్టెడ్ ఏరియాగా నోటిఫై..
తోట్ల కొండను ఆనుకొని మూడు వేల మూడు వందల ఎకరాల భూములను ప్రొటెక్టెడ్ ఏరియాగా కేంద్ర ప్రభుత్వం గతంలో నోటిఫై చేసింది. అదే స్థలంలో గత రెండు ప్రభుత్వాలు స్థలాల కేటాయింపునకు ప్రయత్నాలు చేశాయి. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హయాంలో ఫిల్మ్ క్లబ్ కోసం స్థలం కేటాయిస్తే, బౌద్ధ సంఘాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో చంద్రబాబు తన నిర్ణయం వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ ఇక్కడి భూములను నేవీ కి కేటాయించేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా బౌద్ధ సంఘాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది.
గెస్ట్ హౌస్‌కు 30ఎకరాలు..
కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీ ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం 30 ఎకరాలు తొట్లకొండ భూములను కేటాయించింది. దీనిపై భారీ దుమారమే చెలరేగింది. అయినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా భూమి పూజ కూడా సైలెంట్‌గా కానిచ్చేసింది. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో సర్వేలు చేశామని, కేటాయించిన భూమి తొట్లకొండ పరిధిలోకి రాదని జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. కానీ ఆ నివేదికలపై బౌద్ధ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
చాలా దుర్మార్గం..
అతి పవిత్రమైన స్థలంలో సినిమా క్లబ్ నిర్మించడం చాలా దుర్మార్గమైన చర్యగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభివర్ణించారు. ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.జీవో నెంబరు 21ను పునర్ పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. చుట్టుపక్కల అనేక కొండలు ఉండగా చారిత్రక ప్రదేశం అయిన తొట్లకొండ భూమిపైనే ఎందుకు పడుతున్నారని అటు సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రదేశంలో కాకుండా మరోచోట భూములు కేటాయించాలని విష్ణుకుమార్ రాజు సూచించారు.
బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ తొట్లకొండపై ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు చేపట్టకూడదని ఇప్పటికే పలుమార్లు నిరసనలు వ్యక్తం చేశామని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- ఎన్నికల్లో ఘన విజయంతో స్పీడు పెంచిన జగన్.. మే 26న విశాఖకు రాజధాని?











