Buggana Rajendranath Clarified Payyavula Keshav’s Doubt :
ఏపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో అడ్డదిడ్డంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ వేతనాల చెల్లింపులో ప్రతి నెలా జాప్యం జరుగుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే లెక్కా పత్రం లేకుండానే జగన్ ప్రభుత్వం ఖర్చులు చేస్తోందని, దీనిపై దృష్టి సారించాలని, ప్రభుత్వ ఖజానాపై ఓ కన్నేసి ఉంచాలని పీఏసీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇటీవలే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చాలా ఆలస్యంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఆ స్పందనలోనూ బుగ్గన తనదైన శైలి తెలివిని ప్రయోగించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. లెక్కా పత్రం లేకుండానే ఖర్చులు ఎలా చేస్తామని ప్రశ్నించిన బుగ్గన.. పయ్యావుల ప్రశ్నించిన రూ.41 వేల కోట్లకు లెక్కలున్నాయని వెల్లడించారు. అయితే లెక్కలున్నాయని చెప్పడం కంటే కూడా ఆ లెక్కలేవో బయటపెడితే సరిపోతుందిగా అన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
పయ్యావుల ఆరోపణలేంటంటే..
ప్రభుత్వ జవాబుదారీ లేని వ్యయంపై కాగ్ లేవనెత్తిన అంశాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.41 వేల కోట్లకు అసలు లెక్కలే లేవని పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ తరహా పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని, ఇలాంటి పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణమే రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని, ప్రభుత్వ జవాబుదారీ లేని తనాన్ని నిలువరించాలని ఆయన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన వద్ద ఉన్న ఆధారాలను కూడా ఆయన గవర్నర్ కు అందజేశారు. ఈ వ్యవహారం గతవారం పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఆరోపణలపై ప్రభుత్వం నుంచి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదనలూ వినిపించాయి. అయితే చాలా నింపాదిగా వ్యవహరించిన జగన్ సర్కారు.. అసలు పయ్యావుల చేసిన ఆరోపణలు తనకు వినిపించలేదన్న రీతిలోనే సాగిందన్న విమర్శలూ వినిపించాయి.
లెక్కలు చెప్పకుండానే వివరణ
తాజాగా మంగళవారం మీడియా ముందుకు వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పయ్యావుల కేశవ్ ఆరోపణలపై తనదైన రీతిలో స్పందించారు. ఆడిట్ చేసే సమయంలో పలు రకాల ప్రశ్నలు వేయడం సహజమని.. ఆ ప్రశ్నలనే ఆధారంగా చేసుకుని పయ్యావుల విమర్శలు చేస్తున్నారని బుగ్గన అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే సమావేశమై పరిష్కరించుకోవచ్చని, గవర్నర్ కు లేఖలు రాయడం, మీడియా సమావేశాలను నిర్వహించడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. బిల్లులు లేకుండానే డబ్బులు చెల్లించారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. రూ. 41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని తెలిపారు. నిజాలు తెలుసుకుని ప్రతిపక్షం మాట్లాడాలని హితవు పలికారు. వేల కోట్ల అవకతవకలు జరిగితే సంబంధిత వ్యవస్థలు చూసుకోకుండా ఉంటాయా? అని ప్రశ్నించారు. రూ. 41 వేల కోట్ల బిల్లుల చెల్లింపులపై ఆడిట్ సంస్థ వివరణ కోరిందని.. అన్ని వివరాలను ఏజీ కార్యాలయానికి అందిస్తామని చెప్పారు. ఈ గందరగోళానికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే కారణమని.. 2018లో ఈ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఈ వ్యవస్థను పెట్టారని విమర్శించారు. ఇన్ని వివరాలు చెప్పే బదులుగా.. ఆ చెల్లింపులకు తమ వద్ద ఉన్న లెక్కలు చెబితే సరిపోతుంది కదా అన్న రీతిలో ఇప్పుడు బుగ్గనపై సెటైర్లు పేలుతున్నాయి.
Must Read ;- జగన్ ను బుగ్గన అడ్డంగా ఇరికించేశారే











