జగన్ మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్, ఆయన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి బాధ్యతలు వెలగబెట్టిన నేత బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తమ అధినేతకు ఝలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా బాగా వ్యాపారాల్లో పట్టు సాధించిన రాజేంద్రనాథ్ రెడ్డి తన వ్యాపారాలు మరింత పైకి రావాలంటే.. బీజేపీలోకి వెళ్లడమే ఉత్తమం అని భావిస్తున్నారని తెలిసింది. అందుకే అప్పటి నుంచి బీజేపీలోకి చేరే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల తర్వాతి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు. అప్పటి నుంచి ఒక్కసారే తన సొంత నియోజకవర్గానికి వచ్చినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. పైగా వైసీపీకి కోలుకోలేని ఓటమిని ప్రజలు రుచి చూపించడంతో ఇక పార్టీలో కొనసాగడం అనవసరం అని కూడా బుగ్గన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. 2014లో మొదటిసారి బుగ్గన వైసీపీలో గెలవగా.. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి బుగ్గనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అలా అసెంబ్లీలో జగన్ కు సాయంగా ఉంటూ అధినేతకు బాగా దగ్గర అయ్యారు.
2019లో రెండోసారి కూడా బుగ్గన గెలవడం.. అదే సారి పార్టీ కూడా అధికారంలోకి రావడంతో ఈసారి జగన్ మోహన్ రెడ్డి బుగ్గనకు ఆర్థిక శాఖ కట్టబెట్టారు. కానీ, మూడోసారి టీడీపీ నేత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే, అధికారంలో కొనసాగినంత కాలం బుగ్గన.. రాష్ట్రాన్ని పైకి తేవడం మానేసి.. తన వ్యాపారాలను విస్తరించుకున్నారు. కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు ఏర్పర్చుకొని వ్యాపారాలకు కావాల్సిన అనుమతులను తెచ్చుకొని బాగా లాభం పొందారని టాక్ ఉంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరుల్లో మైనింగ్, సిమెంట్ వంటి వ్యాపారాలు ఉన్నాయి.
ఇక ఎన్నికల్లో పార్టీ మొత్తం ఘోరంగా ఓడిపోయాక బుగ్గన నియోజకవర్గంలో కనిపించడం మానేశారు. అప్పటి నుంచి తమను ఒకసారి మాత్రమే కలిశారని అక్కడి క్యాడర్ కూడా చెబుతున్నారు. బీజేపీలో చేరడం కోసం బుగ్గన చాలా రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి వారి అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బుగ్గన అక్కడే కాషాయ కండువా కప్పుకుంటారని, ఆయనతో పాటు మరికొందరు కూడా చేరే అవకాశం ఉందని అంటున్నారు.











