సినిమా రంగంలో బన్నీ తనకంటూ ఓ పారలల్ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నట్టే కనిపిస్తోంది. అలాంటి తెలివితేటలు అల్లు అర్జున్ కు పుష్కలంగా ఉన్నాయి. ఓ కొత్త సినిమా సామ్రాజ్యం రూపకల్పనకు అతను కృషిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అతనికి కేరళలో మంచి మార్కెట్ ఉంది. అలాగే పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి కూడా అల్లు అర్జున్ వ్యూహం రచించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతనే కేదార్ సెలగం శెట్టి. ఇప్పుడితని ప్రస్తావన ఎందుకంటే అల్లు అర్జున్ కు మంచి స్నేహితుడు కాబట్టి.
తన మిత్రబృందాన్ని నిర్మాతలుగా మలుచుకోవడంలో బన్నీ మంచి నేర్పరి. మరో విషయం ఏమిటంటే యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతోనూ బన్నీకి మంచి స్నేహం ఉంది. అల్లు అరవింద్ ఓటీటీ ‘ఆహా’కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఆహాలో విజయ్, అల్లు అర్జున్ ల పాత్ర పాత్రపై కూడా రకరకాల కథనాలు ఉన్నాయి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘పుష్ఫ’ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా వస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయి.
కేదార్ తనకు మిత్రుడు అయినప్పుడు తనే సినిమా చేయవచ్చుగా, విజయ్ దేవరకొండతో సినిమా ఎందుకు అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఒకే దర్శకుడిగా సినిమాలు చేయడంకన్నా సుకుమార్ ను తన దగ్గరే ఉంచుకుని వరుసగా సినిమాలు చేసే ప్రయత్నాన్ని అల్లు అర్జున్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే హారికా హాసినీకి త్రివిక్రమ్ ఎలాంటి వాడో, మైత్రీమూవీస్ కు సుకుమార్ అలాంటివాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సుకుమార్ మైత్రీమూవీస్ కు దూరమవుతున్నాడా అనే సందేహం కూడా కలుగుతోంది.
మైత్రీ మూవీస్ నుంచి సుకుమార్ చేజారినట్టే కనిపిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప, విజయ్ దేవరకొండ సినిమా పూర్తయ్యేసరికి ఎంతలేదన్నా మూడేళ్లు పడుతుంది. కేదార్ సినిమా కోసం రూ. 10 కోట్లను అడ్వాన్స్ రూపంలో ఇచ్చినట్టు ఫిలింనగర్ టాక్. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కారణంగా విజయ్ దేవరకొండ కూడా మరికొన్ని సినిమాలను కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.
తెలుగు పరిశ్రమలో ఓ కొత్త నిర్మాతగా కేదార్ వెలిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అతనికి అల్లు అర్జున్ తో వ్యాపార భాగస్వామ్యం కూడా ఉన్నందున అది సినిమా భాగస్వామ్యంగా కూడా మారినా ఆశ్చర్యంలేదనే టాక్ ఉంది. బన్నీ పారలల్ ప్రపంచంలోకి ఇంకా ఎంతమంది చేరతారో చూడాలి. తన వ్యాపార సామ్రాజ్యాన్ని బన్నీ ఇంకెంతగా విస్తరించుకుని ముందుకెళతారన్నది అసక్తికరం. తన తండ్రి అరవింద్ తెలివితేటలన్నీ పుణికిపుచ్చుకుని బన్నీ సినిమా రంగంలో అడుగులు వేస్తున్నాడు.