గుంటూరు జిల్లా తాడేపల్లిలో అధిక వడ్డీలు వసూలు చేసే కాల్‌మనీ ముఠాలు మరల చెలరేగిపోయాయి. లాక్ డౌన్‌కు ముందు తాడేపల్లి ప్రకాష్‌నగర్‌కు చెందిన వల్లభనేని బుల్లయ్య, లక్ష్మీభార్గవి దంపతులు, బత్తుల దుర్గ అనే వడ్డీ వ్యాపారి వద్ద లక్షా 80 వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నారు. లాక్ డౌన్‌కు ముందు నెలనెలా వడ్డీ చెల్లించారు. లాక్ డౌన్‌తో పనులు లేకపోవడంతో వడ్డీ చెల్లించలేక పోయారు. దీంతో వడ్డీతో కలిపి మొత్తం రూ. పది లక్షలు చెల్లించాలని వడ్డీ వ్యాపారి దుర్గ, వారి బంధువులు బుల్లయ్యను వేధించారు. వేధింపులు భరించలేక బుల్లయ్య ముందుగా పోలీసులను ఆశ్రయించినా వారు కూడా వేధించడంతో బుల్లయ్య, ఆయన భర్య లక్ష్మీభార్గవి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో కాల్ మనీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
కేసు నమోదు చేసిన పోలీసులు
కాల్‌మనీ వ్యవహారంలో బాధితులు బుల్లయ్య దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు దిగి వచ్చారు. కాల్‌మనీ వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుల్లయ్యను వేధించిన దుర్గ, ఆంజనేయులు, శివయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Must Read ;- సున్నావడ్డీ : రైతు క్షేమమా? ప్రచార ఆర్భాటమా?
విజయవాడలో రెచ్చిపోతున్న కాల్‌మనీ ముఠాలు
విజయవాడ నగరంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం భారీ ఎత్తున సాగుతోంది. భారీ మొత్తాల్లో వడ్డీలకు ఇచ్చి, చెల్లించలేని వారి ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, లొంగకపోతే బెదిరింపులకు దిగడం సర్వసాధారణంగా మారింది. 2015 సంవత్సరంలో విజయవాడలో కాల్‌మనీ ముఠాల వేధింపులు భరించలేక దాదాపు 8 మంది బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆ తరవాత అప్పటి ప్రభుత్వం కాల్ మనీ ముఠాలపై ఉక్కుపాదం మోపడంతో కొంతకాలం వారు సైలెంట్ అయిపోయారు. మరల ఒకటిన్నర సంవత్సరం నుంచి అధిక వడ్డీలు వసూలు చేసే ముఠాలు రంగంలోకి దిగాయి. పేదల కాలనీలను లక్ష్యంగా చేసుకుని వారి అవసరాలకు కొంత నగదు ఇచ్చి ప్రతి నెలా వందకు పది రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారు. అయితే, చాలా మంది బాధితులు బయటకు రావడానికి ఇష్ట పడటం లేదు. కాల్‌మనీ ముఠాల ఆగడాలు, వేధింపులు భరించలేక బాధితులు ఆత్మహత్యాయత్నం చేసినప్పుడే కొన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పోలీసులు హడావుడి చేసి కేసును మూసి వేస్తున్నారు. లేదంటే కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదు.
లాక్ డౌన్‌లో మరింతగా..
లాక్ డౌన్ సమయంలో కూలీలకు పనులు దొరకలేదు. దీంతో చాలా మంది అవసరాలకు కాల్‌మనీ ముఠాల వద్ద అప్పులు చేశారని తెలుస్తోంది. అయితే అధిక వడ్డీలు చెల్లించలేక ఇప్పుడిప్పుడే కేసులు బయటకు వస్తున్నాయి. విజయవాడ నగరంలో పేదలు నివసించే ప్రతి కాలనీలో వడ్డీ వ్యాపారులు తిష్ట వేశారు. అధిక వడ్డీలకు డబ్బు ఇవ్వడం ప్రతి రోజూ వేధింపులకు పాల్పడటం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికైనా పోలీసులు కాల్‌మనీ ముఠాలను ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని బాధితులు కోరుతున్నారు.
Also Read ;- అమరావతి రైతుల పట్ల పోలీసులు ద్వంద్వ వైఖరి మీడియాపై అక్కసా?