పులివెందుల MLA వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికారులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు పులివెందుల RO ఆఫీసు దగ్గర వైసీపీ నేతలు, ఏజెంట్లతో కలిసి జగన్ ధర్నా చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల మున్సిపాలిటీలో తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల్లోకి రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ జగన్ నిరసన చేపట్టారు. ఓటింగ్ జరుగుతున్న కీలక సమయంలో పులివెందుల మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం ద్వారా జగన్ స్పష్టంగా ఎన్నికల నియమావళిని అతిక్రమించారు.
ఎన్నికల రోజున శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ప్రచారాలు, నిరసనలపై నిషేధం ఉంటుంది. అయితే వీటిని ఏమాత్రం లెక్కచేయకుండా, అధికారులపై ఒత్తిడి పెంచేందుకే వైసీపీ చీఫ్ జగన్ ఈ ధర్నా డ్రామాకు తెరలేపారు. ఓటర్లను భయాందోళనలకు గురిచేసేలా, స్థానిక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా ప్రవర్తించడం జగన్ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం.
పులివెందులలో ఓటమి భయం వల్లే జగన్ పోలింగ్ రోజున ఇలాంటి ఉద్రిక్తతలను సృష్టించేందుకు ప్రయత్నించారని స్థానికంగా చర్చ జరుగుతోంది. పులివెందులలో నిశ్శబ్దంగా జరగాల్సిన ఓటింగ్ ప్రక్రియను భంగపరచడం ద్వారా ఆయన రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు.
సొంత నియోజకవర్గంలోనే చట్టాన్ని మీరి ప్రవర్తించడం జగన్ రాజకీయ పతనానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను, ప్రజాస్వామ్య విలువలను బేఖాతరు చేసే జగన్ వైఖరిని ప్రజలు చీ కొడుతున్నారు.











