Cases Registered Against Nara Lokesh Under Attempt To Murder
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్ర కార్యాలయంపై దాడికి దిగి ధ్వంస రచనకు పాల్పడింది అధికార వైసీపీకి చెందిన శ్రేణులు. టీడీపీ కార్యాలయంపై దాడికి దిగడంతో పాటుగా అడ్డు వచ్చిన టీడీపీ కార్యకర్తలను రక్తం కారేలా గాయపరచిన వైసీసీ శ్రేణులను గుర్తించి కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే వైసీపీ శ్రేణులపై ఏదో సాధారణ సెక్షన్ల కింద కేసులు పెట్టేసిన పోలీసులు.. దాడికి గురైన కార్యకర్తలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్న టీడీపీ నేతలపైనే కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ల కింద నమోదు కావడం గమనార్హం. ఇలా అకారణంగా కేసులు నమోదైన వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌లున్నారు. వీరిలో నారా లోకేశ్ ఘటన జరిగిన సమయంలో అక్కడ లేనే లేరు. మరోవైపు దళిత సామాజిక వర్గానికి చెందిన తెనాలిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసే నమోదైపోయింది.
హైదారబాద్‌లో నారా లోకేశ్
వాస్తవానికి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలోనే ఉన్నా.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం హైదరాబాద్‌లో ఉన్నారు. మంగళవారం తొలుత టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై దాడి జరగ్గా.. ఆ వెంటనే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. 4.30 గంటలకు మొదలైన ఈ దాడులు 6 గంటల దాకా కొనసాగాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై 5-5.30 గంటల మధ్య దాడి జరిగింది. ఈ సమయంలో పార్టీ కార్యాలయంలోని పై అంతస్తులో కొమ్మారెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా అక్కడే ఉన్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైసీపీ శ్రేణులు పైకి వెళ్లకుండా అడ్డుకుని తమ నేతలను రక్షించుకున్నారు. ఈ సమయంలో లోకేశ్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన సమాచారం అందుకున్న వెంటనే ఆయన హుటాహుటీన సాయంత్రం 6 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అయితే దాడి సమయంలో అక్కడ లేని నారా లోకేశ్‌పై మంగళగిరి పోలీసులు ఏకంగా హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. లోకేశ్‌తో పాటు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన వారిలో తాడికొండ మాజీ ఎమ్మెల్యే, దళిత సామాజిక వర్గానికి చెందిన తెనాలి శ్రావణ్ కుమార్‌పైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం గమనార్హం. దళితుల పరిరక్షణ కోసం ఏర్పాటైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద దళిత నేతపైనే కేసు నమోదు కావడం గమనార్హం.
Cases Registered Against Nara Lokesh Under Attempt To Murder
ఐడీ కార్డు లేకుండా పోలీసు ఎలా?
టీడీపీ నేతలపై ఈ కేసులు నమోదు కావడానికి గల కారణాలను పోలీసులు తమదైన శైలిలో వివరించారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్లిన సీఐ నాయక్‌పై లోకేశ్ సహా మిగిలిన ముగ్గురు దాడికి పాల్పడ్డారని, దీనిపై సీఐ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే లోకేశ్ సహా నలుగురిపై కేసులు నమోదు చేసినట్లుగా మంగళగిరి పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వాస్తవాన్ని వివరించారు. దాడి జరిగిన తర్వాత హుటాహుటిన అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు గాయపడ్డ తమ వారిని ఆసుపత్రికి తరలించడంతో పాటుగా దాడికి పాల్పడ్డవారిని పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో అశోక్ బాబు చేతికి ఓ వ్యక్తి దొరికాడు. అతడిని నేరుగా మీడియా ముందుకు తీసుకెళ్లిన అశోక్ బాబు.. దాడిలో ఇతడు కూడా పాలుపంచుకున్నాడని వివరించారు. ఆ సమయంలోనే ఆ వ్యక్తి తాను పోలీస్ నని చెప్పాడట. అయితే ఐడీ కార్డు చూపమంటే.. ఐడీ కార్డు పోయిందని చెప్పాడట. అయినా ఐడీ కార్డు లేకుండా.. పోలీసు యూనీఫాం లేకుండా మఫ్టీలో దాడి జరిగిన ప్రదేశంలో నాయక్ ఏం చేస్తున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే.. వైసీపీ శ్రేణులతో కలిసి సీఐ నాయక్ కూడా టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాడా? అన్న దిశగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.