(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన పలాసలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కుల రాజకీయం రగులుతోంది. పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మత్స్యకారుల సామాజక వర్గానికి చెందిన రాష్ట్ర మత్స్య పశుసంవర్థక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు తన సామాజక వర్గాన్ని భూతద్దంలో చూపించి భవిష్యత్ రాజకీయ పునాదులు నిర్మించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే తరుణంలో తన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు గౌతు శిరీషది .. గౌతు సామాజిక వర్గంగా కాదని, ఆమె బీసీ కాదని, ఆమె ఉన్నత వర్గానికి చెందిన చౌదరిని వివాహం చేసుకున్నందున .. ఆ సామాజిక వర్గానికి చెందుతారని ఆరోపిస్తున్నారు. తాను చౌదరిని వివాహం చేసుకోవడం వాస్తవమేనని .. అయితే తన తాత, తండ్రులు గౌతు కుటుంబానికి చెందిన వారేనని ఆమె సుస్పష్టం చేస్తున్నారు. అయినా కులం పేరుతో రాజకీయాలు చేయడమేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. అప్పలరాజు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఏదో ఒక అంశాన్ని వివాదాస్పదం చేస్తూ, నిత్యం వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారనే వ్యాఖ్యలు ఎల్లడెలా వినిపిస్తున్నాయి. ఆయనకు అదే స్థాయిలో టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష బదులిస్తుండటంతో అక్కడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
మంత్రి వెర్సెస్ ఎంపీ
శ్రీకాకుళం జిల్లాలో కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పలాసలో రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటోంది . ఇప్పటికే మంత్రి వర్సెస్ ఎంపీల మధ్య మాటలు అక్కడ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఓ వైపు భూ ఆక్రమణలపై సవాళ్ల పర్వం నడుస్తుండగానే ..ఇప్పుడు మరో కొత్త అంశం తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కానీ..గడచిన ఏడాదిన్నర కాలంలో కానీ రాని కుల ప్రస్తావన ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. దాంతో ఈ నియోజకవర్గం పై టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో రాజకీయం రసకందాయంలో పడింది. మంత్రి డా.సీదిరి అప్పలరాజు కనుసన్నల్లోనే పలాసలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయంటూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పలాస ప్రెస్ మీట్లో చేసిన ఆరోపణలు ఓ రేంజ్లో రచ్చచేస్తున్నట్లు వినికిడి. ప్రతిపక్షాల విమర్శలకు తాను కూడా ఎక్కడా తగ్గేది లేంటూ మంత్రి అప్పలరాజు సైతం రివర్స్ కౌంటర్ గట్టిగానే ఇస్తున్నారు. దాంతో మంత్రి వర్సెస్ ఎంపీల మధ్య మాటల యుద్ధం పలాస నుంచి జిల్లా కేంద్రం వరకూ, రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చకు తావిస్తోంది. పలాస – కాశీబుగ్గ జంట పట్టణాల పరిధిలోని పురుషోత్తపురం రెవిన్యూ విలేజ్‌లో గత కొంత కాలంగా యథేచ్ఛగా భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ముఖ్యంగా సూదికొండ , నెమలికొండ , ఎర్రచెరువు , సూర్యకాలనీ వంటి ప్రాంతాల్లో కొండలు, గుట్టలు , పంట కాలువలు , చెరువులు అని తేడా లేకుండా కబ్జారాయుళ్లు జెండాలు పాతేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగి మంత్రి అప్పలరాజుతో నేరుగా ఢీ కొట్టడంతో పలాస రాజకీయం రచ్చకెక్కింది. అదే సమయంలో పలాస నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి గౌతు శిరీష కూడా ఒక్కసారిగా యాక్టివ్ అవ్వడంతో రాజకీయం రంజుకెక్కి పాకాన పడింది.
Must Read ;- ప్రెస్ మీట్‌పై కౌంటర్ ఇస్తే ఆక్రమణలను రాత్రికి రాత్రే కూల్చేస్తా : మంత్రి సీదిరి
మంత్రి సీదిరి వార్నింగ్
ఎంపీ రామ్మోహన్ నాయుడుకు దీటుగా పలాసలో ప్రెస్ మీట్ పెట్టి .. మంత్రి ఇచ్చిన వార్నింగ్ టీడీపీ నేతలకు , క్యాడర్ కు ఎక్కడో కాలేలా చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా విమర్శలను పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఈ విమర్శలు కులం రంగు పులుముకోవడంతో మంత్రి వర్సెస్ ఎంపీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం మధ్యలోకి గౌతు శిరీష ఎంటరయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న మనుమరాలైన శిరీష ఇంటి పేరు కూడా గౌతు కావడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆమె ఇంటిపేరు , కులం గురించి పదే పదే ప్రస్తావన తెస్తున్నారని తెలిసింది. ఈమెది వేరే కులం…ఆమె భర్తది వేరే కులం అలాంటప్పుడు ఈమె గౌతు వారసురాలు ఎలా అవుతుందంటూ కులాన్ని బయటకు లాగుతూ ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ఈ రచ్చకు గౌతు శిరీష కూడా తనదైన శైలిలో ఇదంతా మంత్రి అప్పలరాజు తెరవెనుక ఉండి తన పేటీఎం బేచ్‌తో నడిపిస్తున్నారని, కులం పేరుతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు వార్ వన్ సైడ్ కాదు.. నేనూ మాటల యుద్ధానికి సిద్ధం అంటూ సంకేతాలు ఇస్తూ వైసీపీలో వణుకు పుట్టించారని తెలిసింది. నా తాత , నా తండ్రి , నా భర్త , నా బంధువులు అంటూ అందరూ ఎవరెవరు ఏ ప్రాంతానికి చెందినవారో చెబుతూ గట్టిగానే సమాధానమిచ్చారట . ఇదే సమయంలో తన కులం, కుటుంబం గురించి మాట్లాడితే మంత్రి కులం , ఆయన భార్య కులం గురించి కూడా మేం బయటికి తీసుకొస్తామంటూ.. అన్నంత పనీ చేశారని భోగట్టా. మంత్రి అప్పలరాజు మత్స్యకార సామాజకవర్గానికి చెందినవారు కాగా.. ఆయన సతీమణి .. శ్రీకాకుళం జిల్లాలోనే బలమైన సామాజక వర్గమైన కాళింగ కులానికి చెందిన వారు .ఇప్పుడు ఇదే అంశాన్ని అస్త్రంగా మార్చుకుని మంత్రి పై శిరీష విమర్శలు ఎక్కుపెట్టారని తెలిసింది.
మూడు నాలుగు దశాబ్దాలుగా
గడచిన మూడు నాలుగు దశాబ్ధాలుగా ఉద్ధానం పరిధిలో మత్స్యకార, కాళింగ సామాజక వర్గాల అండతోనే గౌతు కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోంది . ఇప్పుడు ఈ సామాజకవర్గాలను వారికి దూరం చేసేందుకే వైసీపీ కుల రాజకీయాలకు తెరతీసిందని టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మత్స్యకార సామాజకవర్గంలో కొందరిని తమ వైపు తిప్పుకునేలా మరోమారు టీడీపీ సక్సెస్ అయినట్టు భోగట్టా. అదే సమయంలో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని కాళింగ సామాజికవర్గం, వ్యాపార వర్గాలకు చెందిన వైశ్య సామాజకవర్గాలను కూడా మంత్రికి దూరం చేసేందుకు టీడీపీ వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దీంతో రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీని పలాసలో మట్టి కరిపించేందుకు టీడీపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు భోగట్టా. అధికార, ప్రతిపక్ష వ్యూహ ప్రతి వ్యూహాలు ఎవరికి లాభిస్తాయో వేచి చూడాలి.
Must Read ;- గన్నవరంలో వైసీపీ దళిత నేత ఆత్మహత్యాయత్నం