తళుకు బెళుకుల తారాలోకమిది. అరచేతి మందం మేకప్ తో అసలందం మన కంటికి కనిపించదు. అయినా మనం చొంగ కార్చుకుంటాం. మంగమ్మ మంజరిగా మారి ఇందులో అడుగుపెడితే పాకుడు రాళ్ల మీదనే నడవాల్సి వస్తుంది.
ఆమె మాట్లాడే మాటలు ఆమెవి కావు.. ఆ పాటలూ అంతే.. అసలు ఆమెదంటూ చెప్పుకోడానికి ఇక్కడ ఏమీ ఉండదు. సినిమా హిట్ అయితే రాత్రికి రాత్రి జీవితం మారిపోతుంది. కార్లూ బంగ్లాల జీవితం కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ వదులుకోవాల్సిందేనని రావూరి భరద్వాజ ‘పాకుడు రాళ్ల’లో మంజరి నిరూపించింది. దేశభాషలందు తెలుగు లెస్స అని ఏ ముహూర్తాన శ్రీకృష్ణ దేవరాయలు అన్నారోగానీ నిజంగా ఇక్కడ తెలుగు లెస్సే. అంటే తెలుగును ఇక్కడ మినహాయించాల్సిందే.

ఒళ్లుదాచుకోకుండా నటించాలంటే తెలుగు అసలు పనికిరాదన్న మాట. అందుకే హీరోయిన్లను దిగుమతి చేసుకునే సంస్కృతి వచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయికి ఇక్కడ చోటు దక్కాలంటే ఆమె భాష మారాలి.. పేరు మారాలి. పేరు చివర ఏ రాయ్ అనో, పాటిల్ అనో కొత్త పదాలు చేర్చుకోవాలి. నాలుగు హిందీ ముక్కలు, ఇంగ్లీషు ముక్కలు వచ్చి ఉంటే తిరుగేలేదు. లేకుండా వేరే భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. క్లుప్తంగా ఇదీ సినిమా రంగం పరిస్థితి. సావిత్రి, జమునల కాలం కాదిది.. ఆనాటి రంగస్థలానికీ నేటి రంగు స్థలానికీ చాలా తేడా ఉంది.
క్యాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్..
కమిట్ మెంట్ అంటే అంకిత భావంతో పనిచేయడం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. సినిమాలో అవకాశం రావాలంటే ఆ నిర్మాత లేదా దర్శకుడు లేదా క్యాస్టింగ్ డైరెక్టర్ చెప్పినవారి పక్కలో పడుకోవాలి అన్నమాట. నిన్న రేవతి అనే మలయాళ నటి పెద్ద బాంబు పేల్చింది. ఈ వుడ్ ల ప్రపంచంలో గుడ్ అనే మాట వినిపించడం కష్టమే. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్.. అది ఏ వుడ్ అయినాగాని వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. మలయాళ నటి రేవతి దర్శకుడు రాజేష్ టచ్ రివర్ పై ఈ తరహా ఆరోపణలు చేసింది.
ఒక్క రాజేష్ టచ్ రివర్ పైనే కాకుండా మరో 14 మంది వేధించారని బాంబు పేల్చడంతో సినీజనాలు అవాక్కయ్యారు. పైగా తనను వేధించిన 14 మంది పేర్లను ఫొటోలతో సహా ఫేస్‌బుక్ ద్వారా బయటపెట్టంది. ఈమధ్య మీటూ ఉద్యమం కూడా ఇలాంటి వేధింపుల నుంచే పుట్టింది. గతంలో నటి శ్రీరెడ్డి కూడా ఇలాంటి బాంబులు చాలానే పేల్చింది. తాజాగా సునీత బోయ అనే నటి తనను నిర్మాత బన్నీ వాసు అవకాశాల పేరుతో వాడుకున్నాడని మీడియాకు ఎక్కింది. ఇందులో నిజానిజాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని జనం ఆలోచించరు.
నిప్పులేకుండా పొగరాదు కదా అనుకుంటారు. ఆ మధ్య తెలుగులో ఓ నిర్మాత, క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా ఇలాంటి ఆరోపణల్లో చిక్కుకున్నారు. రామ రామ తనకు ఏ పాపమూ తెలియదన్నారు. కమిట్ మెంట్ తో సినిమా అవకాశం ఇస్తే లభించే పారితోషికం చాలా ఎక్కువగానే ఉంటుంది. సినిమా పారితోషికం వేరు.. కమిట్ మెంట్ తో ఉండే పారితోషికం వేరుగా ఉంటాయి. ఒక కొత్త హీరోయిన్ కు సినిమా వరకూ అయితే 2 లక్షల పారితోషికం అయితే కమిట్ మెంట్ తో రూ. 10 లక్షల వరకూ ఉంటుందట. ఇది ఓ కొత్త హీరోయిన్ అన్న మాటే.
Must Read ;- రాజేష్ టచ్ రివర్ పై మలయాళ నటి రేవతి సంచలన వ్యాఖ్యలు.
సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుంది?
మహిళలపై ఇలాంటి వేధింపులు ఒక్క సినిమా రంగంలోనేనా? బయట లేవా ? అనే ప్రశ్నలు కూడా ఎదురవుతుంటాయి. అన్ని చోట్లా ఉన్నా సినిమా రంగంలో ఇది ఎక్కువగా ఉందనే మాట వాస్తవం. ఆడిషన్స్ జరిగే టప్పుడే ఈ ఒప్పందాలు జరిగిపోతుంటాయి. క్యాస్టింగ్ డైరెక్టర్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాడు. పంచమకారాల్లో ఉండే మద్యం, మగువ, మాంసం.. ఈ రంగుల ప్రపంచంలోనే ఎక్కువగా దొరుకుతాయి. నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారానికి సాక్షులు ఎవరూ ఉండరు. కాకపోతే ఎప్పుడో జరిగిన వ్యవహారాన్ని ఇప్పుడు బయటపెట్టడం అనేది ఎందుకు జరుగుతోందనేది మరో ప్రశ్న.
ఇక్కడ తప్పు కేవలం మగవాళ్లదేనా? ఇందులో ఆడవాళ్ల తప్పులు లేవా? అని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు. అవకాశాల కోసం టెంప్ట్ చేసే ఆడవారు ఉన్నమాట వాస్తవం. పాత విషయాలను తిరగదోడి మీడియాకు ఎక్కుతున్నారంటే వారి నుంచి ఏదో ఆశించబట్టే జరుగుతుంది. పోనీ రాజీ చేసి కొంత డబ్బిచ్చి పంపిద్దామంటే తప్పు అంగీకరించినట్టు అవుతుంది. ఒకరికి డబ్బిచ్చి పంపిస్తే మరికొందరు కూడా ఇలాగే చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఇలాంటి విషయాలు రచ్చగా మారుతుంటాయి. మగువలకు అన్యాయం జరిగితే స్పందించే వకీల్ సాబ్ లు ఉండరిక్కడ.
మలయాళంలో రేవతి అంశాన్ని తీసుకున్నా, తెలుగులో సునీత బోయ అంశాన్ని తీసుకున్నా తెరవెనక ఏదో జరిగిందన్నది మాత్రం సుస్పష్టం. అసలు ఎప్పుడో జరిగిన విషయాలపై ఇంతటి రాద్దాంతం అవసరమా? అంటున్నారు కొందరు. ఒకవేళ జరిగింది వాస్తవమే అయినా ఇలాంటి వాటికి ఆధారాలు కూడా ఉండవు. మగవాళ్లను మోసం చేసి ముగ్గులోకి దింపే మగువలు కూడా ఇక్కడ తక్కువ లేరు. సునీత బోయ అంశం మా కార్యదర్శి జీవిత రాజశేఖర్ వద్దకు కూడా వెళ్లింది.
జీవితా రాజశేఖర్, కరాటే కళ్యాణి కలిసి సునీతతో మాట్లాడి రెండు రోజుల్లో న్యాయం చేస్తామని ఆమెకు మాట ఇచ్చినట్టు తెలిసింది. ఈలోగానే సునీత తొందర పడటాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న శ్రీరెడ్డి, నిన్న సునీత, నేడు రేవతి, రేపు ఇంకెవరో? ఈ విషయంలో తప్పు ఎవరిది అనడం కన్నా దీనికి పరిష్కార మార్గం ఏమిటి అనేది ఆలోచించాల్సిందే. దీనికి సినిమా పెద్దలంతా కూర్చుని ఓ పరిష్కార మార్గాన్నినిర్దేశించుకుంటే తప్ప ఈ రాద్దాంతాలు ఆగవు.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- యాంకర్ శ్యామల జీవితంలో అలనాటి చీకట్లు











