తెలంగాణలో ఏ మూలన ఏమి జరిగినా తెలిసే నిఘా వ్వవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం, అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (CCC టవర్స్) నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు, ఏం జరిగినా ఆ సమచారం వెంటనే ఈ సెంటర్‌కు చేరుతుంది.ఈ ఏడాది చివరి నాటికి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తెలంగాణలోని అన్ని వివరాలు ప్రతి అంగుళం 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్రంలో ఏ మూలన ఏమి జరిగినా ఇక్కడ తెలిసిపోతుంది. తొలుత ఈ సెంటర్ నిర్మాణానికి రూ. 350 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయగా 2019లో రూ.450 కోట్లకు పెరిగింది. గతేడాది చివరలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో మరో రూ.200 కోట్లు అంటే మొత్తం రూ.650 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
ఇవీ ప్రత్యేకతలు
ఏడు ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో (ఏ, బీ, సీ, డీ ) కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్లు నిర్మిస్తున్నారు. టవర్-ఏ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84,2 మీటర్ల ఎత్తు ఉండగా, టవర్-బీ, సీ, డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది ఆఫీస్ ఉండే టవర్-ఏ. హెలిప్యాడ్‌తో కలిపి జీ ప్లస్ 20 అంతస్తుల్లో టవర్-ఏ నిర్మించారు. ఓపెన్ ఆఫీస్, మీటింగ్ రూమ్స్, కాన్ఫరెన్స్ రూం, క్యాబిన్లు ఉంటాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ క్యాబిన్లు, మల్టీపర్పస్ హాల్, హెలీప్యాడ్ టవర్-ఏలోనే ఉంటాయి. టవర్ -బీని జీ ప్లస్ 15గా నిర్మించారు. ఇందులో ఓపెన్ ఆఫీస్, మీటింగ్ రూమ్స్, కాన్ఫరెన్స్ రూం, క్యాబిన్స్, డీజీపీ, సీఎస్ క్యాబిన్లు, డయల్-100 ఉంటాయి. టవర్-సీలో ఆడిటోరియం ఉంటాయి. టవర్-డీలో మీడియా సమావేశాలకు ఏర్పాట్లు, క్యాంటీన్, శిక్షణా గదులు, మంత్రుల క్యాబిన్లు, వార్ రూం ఉంటాయి. ఒకదాని నుంచి మరో టవర్‌కు చేరుకునేందుకు వీలుగా స్కైవేలు నిర్మించారు.
ప్రధాన విభాగాలన్నీ ఇక్కడే..
పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక, రైల్వే, విమానాశ్రయ భద్రతా విభాగం, మిలటరీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, రెవెన్యూ వంటి కొన్ని ముఖ్య విభాగాలు ఇక్కడి నుంచి పని చేసే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. హోంమంత్రి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాలు ఈ సెంటర్‌లోనే కొనసాగుతాయి. డీజీపీ కార్యాలయం ఇందులో ఉన్నా ప్రస్తుతం లక్డీకాపూల్‌లోని కార్యాలయం నుంచే ప్రధానంగా విధులు నిర్వహిస్తారు. వారంలో ఒకటి, రెండు రోజులు డీజీపీ ఇక్కడి నుంచి విధులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సీసీ కెమెరాలన్నీ రికార్డింగ్ ట్విన్ టవర్స్‌కు అనుసంధానం కావడంతో అందరి కదలికల్ని అధికారులు ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం సీసీ కెమెరాలతో మోస్ట్ వాంటెడ్, పాత నేరస్తులు, అనుమానితుల్ని గుర్తించి గస్తీ విధుల్లో ఉండే సిబ్బందికి సమాచారం చేయటం ద్వారా వారిని అదుపులోకి తీసుకుంటారు.
రాష్ట్రంలో 8 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్‌గా రూపుదిద్దుతున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. జిల్లాల్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లతో ఈ సెంటర్ అనుసంధానమై ఉంటుంది. దీంతో ఇది నెట్‌వర్క్ ఆఫ్ కమాండ్ సెంటర్స్‌గా మారుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ సహకారం, ప్రజలు, నాయకుల భాగస్వామ్యంతో 8 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఒక కెమెరా నుంచి వచ్చే ఫీడ్‌ను పోలీసుశాఖతో పాటు ఆయా ప్రభుత్వ విభాగాలు ఉపయోగించుకునే వీలుంటుంది. దీంతో అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు అన్ని విభాగాలు కలిసి పనిచేసి మెరుగైన సీవలు అందించవచ్చని డీజీపీ తెలిపారు.
Must Read ;- తెలంగాణలో ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు











