తమిళనాడు, కేరళ, అసోం, బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చరిలకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బెంగాల్ లో 294 స్థానాలు, తమిళనాడులో 234, కేరళ 140, అసొం 126, పుదుచ్చేరి 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు 16 రాష్ట్రాలలో 34 అసెంబ్లీ స్ధానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపింది.
ఎన్నికల షెడ్యూల్..
- అసోంలో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు. తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 47 స్ధానాలకు మార్చి 2న నోటిఫికేషన్.. మార్చి 10న నోటిఫికేషన్ పరిశీలన జరుగుతుంది. మార్చి 27న తొలి విడత, ఏప్రిల్ 1 రెండో విడత, ఏప్రిల్ 6న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు.
- కేరళలోని 140 అసెంబ్లీ స్ధానాలకు, తమిళనాడులోని 234 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 6 పోలింగ్ నిర్వహించనున్నారు.
- పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు.
- పశ్చిమ బెంగాల్ లో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్29 తేదీల్లో ఎనిమిది దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.
- మే 2న అన్ని రాష్ట్రాల కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.
రాబోవు ఎన్నికల్లో.. 18.68 కోట్ల మంది ఓటు వినియోగించడానికి అర్హులని సీఈసీ తెలిపింది. పుదుచ్చేరిలో 1,559 పోలింగ్ కేంద్రాలు, అసోంలో 33 వేల 530 కేంద్రాలు, తమిళనాడులో 88 వేల కేంద్రాలు, బెంగాల్ లో 1,01,916 కేంద్రాలు, కేరళలో 40 వేల 771 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు,
నిబంధనలు పాటించాలి..
ఎన్నికల వేళ కరోనా నియంత్రణకు తగిన జాగ్రత్తలు పాటించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కరోనా చర్యల్లో భాగంగా.. వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఎన్నికల అధికారులుగా నియమిస్తామని ప్రకటించింది. 80 ఏళ్లు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. అభ్యర్ధితో పాటు కేవలం నలుగురు మాత్రమే ఉండాలని ఆదేశించింది. అంతేకాదు.. రోడ్ షోలలో 5 వాహానాలకు మించకూడదని కూడా ఎన్నికల కమిషన్ చెప్పుకొచ్చింది. కరోనా కారణంగా పోలింగ్ సమయాన్ని గంట పెంచుతున్నట్లు ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో ఆన్ లైన్ నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఈసీ తెలియజేసింది.
Must Read ;- దక్షిణాదిలో ఒకే విడత.. పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో











