నవంబరు 16- ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యం మామూలుది కాదు. ప్రముఖ పత్రికాధిపతి ‘ఈనాడు’ రామోజీరావు పుట్టిన రోజు ఇది. 2000 సంవత్సరంలో ఇదే రోజున ఆయన తన ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ఓ సినిమా ప్రారంభోత్సవాన్ని తన రామోజీ ఫిలింసిటీలో జరిపారు. ఆ సినిమా మరేదో కాదు ‘నిన్ను చూడాలని’. ఆ సినిమా హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా మేకప్ వేసుకున్నది కూడా ఈరోజేనే.
తారాపథానికీ తారక రాముడికీ ఉన్న అవినాభావ సంబంధమే వేరు. తరకలా వెలిగిపోతాడనే ఉద్దేశంతోనే తారక రాముడనే పేరు వచ్చిందేమో తెలియదు. ఓ తారక రాముడు ధ్రువ తరకలా వెలిగిపోతే, మరో తారక రాముడు అలాంటి వెలుగులనే విరజిమ్ముతున్నాడు. నందమూరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆ తారక రాముడు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్
Must Read:-ఎన్టీఆర్ రామబాణం ప్రభాస్ చేతికి
ఒకప్పటి మహానటుడు తారక రామారావు పేరు పెట్టుకుని అభినయంలోనూ, అందంలోనూ ఆయనకు ఏమీ తీసికట్టుగా లేకుండా అడుగులు వేస్తున్న ఈ జూనియర్ కు హీరోగా నేటితో 20 ఏళ్లు నిండాయి. వారసత్వం రావడం గొప్ప విషయం కాదు.. దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. అలాంటి నిజమైన వారసుడిగా జూనియర్ తారక రామారావుని చెప్పుకోవాలి. 20 ఏళ్ల కెరీర్ లో 30 సినిమాల ప్రయాణాన్ని అవలీలగా సాగించాడీ నట సింహం.
పువ్వు పుట్టగానే..
ఈ మాట అక్షరాలా నిజమని మన జూనియర్ నిరూపించారు. ఆ సీనియర్ పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరైతే.. ఈ జూనియర్ కూడా చిన్న వయసులోనే అలాంటి పాత్రల వైపే మొగ్గు చూపాడు. అందరికీ తెలిసింది రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రం బాల ‘రామాయణం’తో. చిన్నప్పుడే సంప్రదాయ నాట్యంలో శిక్షణ తీసుకున్న ఈ జూనియర్ కు కూడా పౌరాణిక పాత్రలంటే మక్కువ ఎక్కువ. కాకపోతే ఈరోజుల్లో అలాంటి సినిమాలు తక్కువగా తెరకెక్కుతున్నాయి. చూసేవారుంటే తీసేవారికేమీ కొదవ ఉండదు.
ఈ బాల తారక్ మొదటగా మొహానికి రంగేసుకుంది మాత్రం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో. 1991లో ఇది జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టింది 1983లో. అంటే ఎనిమిదేళ్ల వయసులోనే మొహానికి రంగేసుకున్నాడన్న మాట. ఇది హిందీలో రూపొందే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా. ఇందులో భరతుడి పాత్రను ఎన్టీఆర్ చేశాడు. ఎన్టీఆర్ దృష్టిలో ఈ బుడతడు పడటానికి కారణం కూడా ఉంది. చిన్నప్పుడే హిందీని అనర్గళంగా మాట్లాడటాన్ని తాత ఎన్టీఆర్ గమనించారు. అప్పటికే ఆయనకు బ్రహ్మర్షి విశ్వామిత్రను హిందీలో తీయాలన్న ఆలోచన ఉంది.
Must Read:-అక్కడ విజయ్.. ఇక్కడ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
మనవాడు బాగానే పనికొస్తాడని తాతకు నమ్మకం కలిగింది. అలా తొలి అవకాశాన్ని ఇచ్చారు. దుష్యంతుడి కొడుకు పాత్ర ఇది. అయితే షూటింగు దశలోనే ఈ సినిమా ఆగిపోయింది. పైగా తెలుగలో కూడా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అన్నగారు రాజకీయాల్లో బిజీగానూ ఉన్నారు. అలా జూనియర్ ను భరతుడిగా ప్రేక్షకులు చూడలేకపోయారు. రాముడి పాత్రలోనే చూడాల్సి ఉండటంవల్లే అలా జరిగింది కాబోలు. ఆ తర్వాత 1996లో ‘రామాయణం’ ప్రారంభమైంది.
హీరోగా తొలిసినిమా ‘నిన్నుచూడాలని’
జూనియర్ ఎన్టీఆర్ కు హీరోగా మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం ఉషాకిరణ్ మూవీస్ సంస్థ. ‘నిన్ను చూడాలని’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి వి. ఆర్. ప్రతాప్ దీనికి దర్శకత్వం వహించారు. హీరోగా ఆయన మేకప్ వేసుకున్న రోజు నవంబరు 16, 2000 సంవత్సరం. 2001 మే 25న ఆ సినిమా విడుదలైంది. అంటే కచ్చితంగా ఆయన మేకప్ వేసుకుని ఈరోజుకు 20 ఏళ్లు అయ్యిందన్న మాట. ఆ తర్వాత అతను వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడిగా మేకప్ వేసుకున్న తొలి సినిమా ఇప్పటిదాకా విడుదల కానేలేదు.
Must read:-Jr NTR Shreds His Muscles For Komaram Bheem
ఈ హిందీ సినిమాలో బాలకృష్ణ కూడా నటించారు. ఆయన హరిశ్చంద్రుడు, దుష్యంతుడు పాత్రలను పోషించారు. మరి ఈ సినిమాని కూడా ఇప్పటి ‘నర్తనశాల’ లాగా విడుదల చేయాలన్న ఆలోచన బాలయ్య బాబుకు ఎందుకు రాలేదో? జూనియర్ తొలిసినిమాలో హీరోయిన్ రవీనా రాజ్ పుత్. ఎస్.ఎ. రాజ్ కుమార్ దీనికి సంగీతం అందించారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడింటె నంబర్ 1 లో చేసే అవకాశం వచ్చింది. దీనికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు
Also Read:-అందరి డైలాగులతో అదరగొట్టిన ‘నర్తనశాల’ ట్రైలర్
అచ్చు తాతను పోలిన రూపం కావడంతో జనంలోకి త్వరగా అతన్ని రిసీవ్ చేసుకున్నారు. 2001లోనే వచ్చిన ‘ఆది’ సినిమాతో జూనియర్ ను ఒక్కసారిగా స్టార్ డమ్ వరించివేసింది. ఇంతచిన్న వయసులో అంత పెద్ద స్టార్ గా ఈ కుర్రాడు ఎదుగుతాడని ఎవరూ ఊహించలేకపోయారు. నూనూగు మీసాల యవ్వనంలోనే స్టార్ డమ్ ను చూసిన హీరోలా జాబితాలో మన జూనియర్ కూడా చేరిపోతారు. మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ‘సింహాద్రి’ చేసేసరికే అప్పటికే ఉన్న అగ్రహీరోల్లో సైతం గుబులు పుట్టించాడు జూనియర్.
ఒక తరం వెలుగులు మళ్లీ మూడో తరంలో ఉంటాయన్న పెద్దల మాటను నిజం చేశాడీ నట వారసుడు. తాత మాదిరిగా విభిన్న పాత్రలను చేసే అవకాశం వస్తే జూనియర్ ను మరో సీనియర్ లానే జనం భావిస్తారు. ఆ మహానటుడి ప్రయాణం అనితర సాధ్యం.. అది వారసులకే సాధ్యం కావాలి.. మరి జూనియర్ ముందు ఇంకా ఎంతో భవితవ్యం ఉంది. మరెన్ని మేలు మలుపులు జూనియర్ నట జీవితంలో ఉంటాయో చూడాల్సిందే.
Also Read:-rrr diwali special
– హేమసుందర్ పామర్తి